హిమాచల్‌ ప్రదేశ్‌లో..  16మంది పర్వతారోహకులు గల్లంతు

– వారిలో 10మంది విదేశీయులు
– గల్లంతైనవారిని గుర్తించేందుకు సహాయచర్యలు
చంబా, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : హిమాచల్‌ ప్రదేశ్‌లో 16మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. వీరిలో పది మంది విదేశీయులు ఉన్నారు. కాగా వీరి ఆచూకీ గుర్తించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల చంబా ప్రాంతంలో పర్వతారోహణకు వెళ్లిన 16 మంది ఆచూకీ తెలియడం లేదు. వారిలో పది మంది విదేశీయులు కూడా
ఉన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, విపరీతంగా మంచు కురుస్తున్న సంగతి తెలిసిందే. గల్లంతైన పర్వతారోహకుల బృందాన్ని గుర్తించేందుకు పోలీసులు, స్థానిక పోర్టర్లు, నిపుణులైన పర్వతారోహకులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఐఐటీ రూర్కీ విద్యార్థులు కూడా గల్లంతు కావడంతో సహాయక సిబ్బంది వారిని కాపాడారు. అప్పుడు కాపాడిన వారిలో 45మంది ఐఐటీ విద్యార్థులు, ఐదుగురు అమెరికా పౌరులు, ఇద్దరు జర్మనీకి చెందినవారు ఉన్నారు. జిల్లా యంత్రాంగం, సరిహద్దు రహదారుల సంస్థ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి లహుల్‌ లోయలో చిక్కుకున్న వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు, మంచు కురుస్తున్నందున మారమూల ప్రాంతాలకు రహదారుల ద్వారా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాయు సేన హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లు అందిస్తోంది.