హుజురాబాద్‌కు మోగిన నగారా

` ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
` అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల
` నామినేషన్‌ దాఖలుకు అక్టోబర్‌ 8 చివరి తేదీ
` అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలన
` అక్టోబర్‌ 30న ఎన్నిక..నవంబర్‌ 2న కౌంటింగ్‌
` ఉప ఎన్నికతో కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్‌
` నామినేషన్‌ దాఖలులో ర్యాలీలకు అనుమతి లేదు
` కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి
` పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలి
` 305 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు ..ఇవిఎంల పరిశీలన
` విూడియాతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌
న్యూఢల్లీి,సెప్టెంబరు 28(జనంసాక్షి):కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30 హుజూరాబాద్‌, బద్వేలు ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్‌ దాఖలుకు అక్టోబర్‌ 8 చివరి తేదీగా నిర్ణయించింది. అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్‌ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అక్టోబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు… ఆ వెంటనే ఫలితాలు వెలువడనున్నాయి. హుజూరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు నియోజకవర్గానికి కూడా అక్టోబర్‌ 30న ఉప ఎన్నిక జరగనుంది. ఇక దేశ వ్యాప్తంగా మరో 28 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కూడా ఇదే షెడ్యూల్‌ వర్తించనుంది. హుజూరాబాద్‌లో ఇప్పటికే ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అధికార టిఆర్‌ఎస్‌, విపక్ష బిజెపిలుపోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి కొండా సురేఖ బరిలోకి దిగుతారని అనుకుంటున్నారు. అధికారికంగా ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇకపోతే హుజూరాబాద్‌ ఉప ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటెలను మంత్రివర్గం నుంచి తప్పించడం, ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. కొడుకు కేటీఆర్‌ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్ని తనను పక్కకు తోశారని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపోతానని, కేసీఆర్‌, హరీశ్‌రావు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్‌ విసిరారు. ఇకపోతే హుఊరాబాద్‌ వేదికగా దళితబంధుకు సిఎం కెసిఆర్‌ శ్రీకారం చుట్టారు. ఇప్పుడక్కడ ఈ పథకం కింది ఒక్కో కుటుంబానికి పదిలక్షలు అందుతున్నాయి. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
ఉప ఎన్నికతో కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్‌
హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ వెంటనే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అయితే ఎన్నికల ప్రచారంలో రోడ్‌ షోలు, బైక్‌ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని చెప్పారు. ఎన్నికల నియామవళికి సంబంధించి సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కొవిడ్‌ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేయాలని శశాంక్‌ గోయల్‌ ఆదేశించారు. ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులు, పథకాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కొత్తగా పథకాలకు అనుమతి లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను ఇప్పటికే పరిశీలించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 305 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 47 పోలింగ్‌ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కొవిడ్‌ రోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం లో 2,36,430 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుష ఓటర్లు 1,17,552, మహిళ ఓటర్లు 1,18,716 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 14 మంది ఉండగా, సర్వీస్‌ ఓటర్లు 147, ట్రాన్స్‌ జెండర్‌ ఒకరు ఉన్నారు. ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కూడా త్వరలోనే ఉంటుంది అని శశాంక్‌ గోయల్‌ స్పష్టం చేశారు. మిగత రాష్టాల్ల్రో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది కాబట్టి అన్ని రాష్టాల్రతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని పేర్కొన్నారు.

 

(దేశవ్యాప్తంగా.. 30 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు
షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం)
దిల్లీ,సెప్టెంబరు 28(జనంసాక్షి):దేశవ్యాప్తంగా కొవిడ్‌ తీవ్రత నియంత్రణలో ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు లోక్‌సభ సీట్లకు ఉపఎన్నిక నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ స్థానాల్లో అక్టోబర్‌ 30న ఎన్నికలు జరగనుండగా నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపడుతారు.మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీతో పాటు దాద్రా నగర్‌ హవేలీ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ మూడు లోక్‌సభ స్థానాల్లోని సిట్టింగ్‌ అభ్యర్థులు ఈ మధ్యే ప్రాణాలు కోల్పోయారు. మండీ లోక్‌సభ ఎంపీ రామ్‌స్వరూప్‌ శర్మ(ఃఏఖ) ఈ ఏడాది మార్చి నెలలో దిల్లీలోని ఆయన నివాసంలో మృతిచెందారు. మరో భాజపా ఎంపీ నంద్‌కుమార్‌ సింగ్‌ చౌహాన్‌ మృతి చెందడంతో ఖాండ్వా లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఇక దాద్రా నగర్‌ హవేలీ స్వతంత్ర అభ్యర్థి మోహన్‌ డెల్కర్‌ అనుమానాస్పద స్థితిలో ముంబయిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉపఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఈ మూడు లోక్‌సభ స్థానాలకు అక్టోబర్‌ 30న ఎన్నికలు జరుగనున్నాయి.
14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు..
లోక్‌సభతో పాటు 14రాష్ట్రాల్లో 30శాసనసభ స్థానాల్లోనూ ఉపఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో ఐదు, పశ్చిమబెంగాల్‌లో నాలుగు, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయా రాష్ట్రాల్లో మూడు చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక బిహార్‌, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రెండేసి అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.ఉపఎన్నికల నిర్వహణపై ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభిప్రాయాలను తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ముఖ్యంగా కరోనా వైరస్‌ విజృంభణ, వరదలు, పండుగలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించి వాస్తవ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వాటిపై సవిూక్షించిన తర్వాతే ఉపఎన్నికలపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనలో పేర్కొంది. నామినేషన్‌కు ముందు, తర్వాత ఊరేగింపులపై నిషేధం, ప్రచార కార్యక్రమాల్లో పరిమిత సంఖ్యలోనే కార్యకర్తలు, ప్రచారకర్తలను అనుమతించడం, ఎన్నికలకు 72గంటల ముందే ప్రచారాన్ని ముగించడం వంటి ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.ఇదిలాఉంటే, సెప్టెంబర్‌ 30వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌ అసెంబ్లీ స్థానంతో పాటు మరో మూడు స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 4న ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో మరో రెండు (శంషేర్‌గంజ్‌, జంగీపూర్‌) అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గానికి సెప్టెంబర్‌ 30న ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 3వ తేదీన వీటి కౌంటింగ్‌ జరుగనుంది.