హెచ్-1బీ వీసాదారులు.. దోపిడీకి గురవుతున్నారు
– పనికి తగిన వేతనం వారికి రావడం లేదు
– అమెరికా థింక్-ట్యాంక్ వెల్లడి
వాషింగ్టన్, జనవరి17(జనంసాక్షి) : అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ ఉద్యోగాల విషయంలో.. జీతాల పెంపుతో పాటు పలు సంస్కరణలు తీసుకురావాలని సౌత్ ఏషియన్ సెంటర్ ఆఫ్ ది అట్లాంటిక్ కౌన్సిల్ (థింక్-ట్యాంక్) అనే సంస్థ సూచించింది. ఈ వీసాలపై పనిచేసే వారికి మంచి పని వాతావరణం, ఉద్యోగ హక్కులు కల్పించాలని పేర్కొంది. హెచ్-1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొస్తామని, మంచి సంస్కరణలు చేస్తామని, ప్రతిభావంతులు అమెరికాలో ఉండేందుకు మార్గం సుగమం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఈ సంస్థ ఉద్యోగ పరిస్థితులను చాలా మెరుగు పరచాలంటూ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న హెచ్-1బీ వీసా విధానం వల్ల అమెరికన్లకు హానీ జరగడంతో పాటు.. హెచ్-1బీ వీసాదారులు దోపిడీకి, వేధింపులకు గురవుతున్నారని, తగిన వేతనం ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. వారికి తగిన వేతనంతో పాటు చక్కని పని వాతావరణం, ఉద్యోగ హక్కులు కల్పిస్తే ఇక్కడ వారి జీవితాలు మెరుగవుతాయని పేర్కొంది. ఈ వీసాల విషయంలో మొదట చేయాల్సిన పని జీతాలు పెంచడం అని తెలిపింది. అప్పుడే అత్యుత్తమ ప్రతిభావంతులు అమెరికాకు వస్తారని వెల్లడించింది. కంపెనీలు అమెరికన్లను కూడా తగినన్ని ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హతను బట్టి పదవులు ఇవ్వాలని తెలిపింది.