హైదరాబాద్‌లో వర్ష బీభత్సం
– జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు
– గోల్కొండ రహదారిపై కూలిన భారీ వృక్షం
– వాగులను తలపించిన రహదారులు
– తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ప్రయాణీకులు
– బోట్లపై తిరుగుతూ పాలప్యాకెట్లు అందించిన సిబ్బంది
– లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది
హైదరాబాద్, సెప్టెంబర్27 (జనంసాక్షి): హైదరాబాద్‌లో భారీ వర్షం భీభత్సం సృష్టించి.. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు ఏకదాటిగా వర్షం కురవడంతో హైదరాబాద్ రహదారులన్నీ జలదిగ్బంధమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షంపునీరు చేరడంతో నివాసదారులు రాతంత్రా జాగారం చేయాల్సి వచ్చింది. కనీసం బయటకు రాలేని పరిస్థితిలో పలు కాలనీ వాసులున్నారు. నడుం లోతులో వర్షపు నీరు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆనంద్ బాగ్‌లో పలు కాలనీలను జలదిగ్బంధలో చిక్కుకున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో నీట మునిగిన కాలనీల్లో జీహెఛ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది పర్యటించారు. బోట్లలో తిరుగుతూ.. ఇంటింటికి పాలు, కూరగాయాలు, టిఫిన్స్, వాటర్ ప్యాకెట్లు అందించారు. దీనికితోడు నిత్యావసర సరుకులు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో కనీసం వంట చేసుకొనే పరిస్థితిలో ఉన్నామని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం, సరుకులు కూడా నీటితో తడిచిపోయాయని , కనీసం తాగడానికి నీళ్లులేని పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మూడు రోజులుగా వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం కొంత తెరిపించిందని అనుకున్న తరుణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. రహదారులపై భారీగా నీరు చేరింది. అర్ధరాత్రి కావడంతో అంతగా ట్రాపిక్ జాం కాలేదు. ప్రధానంగా నివాసాలు, కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అపార్టమెంట్ సెల్లార్‌లోకి భారీగా నీరు వచ్చి చేరింది. వాహనాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో చిన్న పిల్లలకు పాలు, ఇతరత్రా ఆహార పదార్థాలు లేకపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు పడ్డారు. ఎంఎస్ మక్తాలో సుమారు 200 ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఉప్పల్, మియాపూర్, లకడీకపూల్ పరిసర ప్రాంతాల్లో 12 నుంచి 15 సెం.విూటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అవిూర్ పేట, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మారేడ్ పల్లి, సైనిక్ పురితో పాటు పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. గుడి మల్కాపూర్‌లో అత్యధికంగా 15 సెం.విూటర్ల వర్షపాతం నమోదైంది.
రంగంలోని దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీటిని కాల్వల్లోకి పంపిస్తున్నారు. ఇక ఉప్పల్ మెట్రో ప్లే ఓవర్ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షం ధాటికి కాలాపత్తర్‌లోని ఓ స్కూల్ గోడ కూలి పార్కింగ్ చేసిన కారుపై పడిపోయింది. దీంతో కారు ధ్వంసమైంది. వర్షపు నీటితో ముంపునకు గురయిన ప్రాంతాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్‌లు పర్యటించి పరిస్థితిని సవిూక్షించారు. మక్తల్ పరిసర ప్రాంతాల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరడంతో వారంతా రాత్రి జాగరణ చేశారు. గోల్కొండ ప్రధాన
రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటన స్థలానికి జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది చేరుకుని భారీ వృక్షాన్ని తొలగించారు. క్‌పేట్ ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రోడ్డును మూసివేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పైనుంచి వరద ప్రవాహం వస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని మూసీ కాల్వలోకి విడుదల చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొత్తం 26తూముల ద్వారా 3,486 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కవాడిగూడ, అశోక్‌నగర్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, కోరంటి ఆసుపత్రి, సత్యానగర్, రత్నానగర్ విూదుగా మూసీ ప్రధాన కాల్వలోకి వరద నీటిని విడుదల చేశారు. నాలల పరీవాహక ప్రాంతంలో ఉన్న నివాసితులను అధికారులు అలర్ట్ చేశారు. ప్రజలు నదిలోకి దిగరాదని హెచ్చరికలు జారీ చేశారు.-