భారత్ దాడి చేసే అవకాశం ఉంది
సరిహద్దు గ్రామాలకు యుద్ద హెచ్చరికలు
సైనిక ఆస్పత్రులను అప్రమత్తం చేసిన పాక్ ప్రభుత్వం
పుల్వామా ఘటనతో అప్రమత్తం అయిన దాయాదిదేశం
ఇస్లామాబాద్,ఫిబ్రవరి22(జనంసాక్షి): పుల్వామా దాడి నేపథ్యంలో ప్రతీకారం కోసం చూస్తున్న ఇండియా ఏక్షణాన అయినా దాడి చేయవచ్చన్న ఆందోళనలో పాకిస్థాన్ ఉంది. దీంతో ముందస్తు చర్యలకు దిగింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ భద్రతా అధికారులతో సవిూక్షించిన మరునాడే తీసుకుంటున్న చర్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇండియా ఏ సమయంలో అయినా దాడి చేయొచ్చని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ వాసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నది. గ్రూపులుగా తిరగకండి.. బంకర్లను ఏర్పాటు చేసుకోండి.. రాత్రిపూట అనవసరంగా ఉన్న లైట్లను ఆర్పేయండి.. అనుమానాస్పదంగా ఏది కనిపించినా చెప్పండి అని పీవోకే ప్రజలకు ఇమ్రాన్ ప్రభుత్వం సూచించింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మదే ఈ దాడికి పాల్పడటంతో దీని వెనుక పాకిస్థాన్ ఐఎస్‌ఐ హస్తం ఉన్నదనీ ఇండియా ఆరోపి స్తున్నది. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. దీంతో పాక్ ముందు జాగ్రత్తగా పీవోకే ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నది. ముఖ్యంగా భీమ్‌బర్, నీలమ్, రావల్‌కోట్, హవేలీ, కోట్లి, జీలం ప్రాంతాల్లోని వాసులు జాగ్రత్తగా ఉండాలని పాక్ ప్రభుత్వం హెచ్చరించింది. భారత ఆర్మీ హింసకు పాల్పడవచ్చని ప్రజలకు చెబుతున్నది. 2016లో ఉరి దాడి తర్వాత కూడా పీవోకేలో ఇలాగే
భారత ఆర్మీ సర్జికల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత ఆర్మీ వెంటనే రంగంలోకి దిగింది. దాడి సూత్రధారిని ఇప్పటికే ఎన్‌కౌంటర్‌లో హతమార్చింది. దీంతో మరోసారి పీవోకేలో కూడా దాడి జరగొచ్చని పాకిస్థాన్ భయపడుతున్నది. మరోవైపు పాకిస్థాన్ సర్కారు చేస్తున్న సన్నాహాలు చూస్తుంటే ఆ దేశం యుద్దానికి సిద్ధమైందనే విదితమవుతోంది. ఒకవేళ యుద్ధం వస్తే గాయపడే సైనికులకు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ ఆర్మీ జిలానీ ప్రైవేటు ఆసుపత్రికి తాజాగా లేఖ రాసింది. భారతదేశం దాడి చేస్తే సిద్ధంగా ఉండేందుకు పాకిస్థాన్ ఇప్పటికే యత్నాలు ఆరంభించింది. పాక్ అధికారిక రెండు డాక్యుమెంట్లను పరిశీలిస్తే ఆ దేశం యుద్ధ సన్నాహాలు ఆరంభించిందని తేటతెల్లమవుతోంది. క్వెట్టా కంటోన్మెంటు కేందానికి చెందిన పాకిస్థాన్ సైనికస్థావరం నుంచి సైనిక కమాండర్ ఆసియానాజ్ పేరిట ఈ నెల 20వతేదీన జిలానీ ఆసుపత్రికి ఓ లేఖ రాశారు. ఈ లేఖ జిలానీ ఆసుపత్రి అబ్దుల్ మాలిక్ కు వచ్చింది. ఒకవేళ ఇండియాతో యుద్ధం వస్తే గాయపడే పాక్ సైనికులకు వైద్యసహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరుతూ సైనిక ఉన్నతాధికారి ఆసుపత్రికి లేఖ రాశారు. యుద్ధంలో గాయపడిన సైనికులకు అత్యసవరంగా చికిత్స అందించాల్సి వస్తే సింధ్, పంజాబ్ లలోని మిలటరీ ఆసుపత్రులతోపాటు బలోచిస్థాన్ సివిల్ ఆసుపత్రి సిద్ధంగా ఉండాలని ఆర్మీ కోరింది. మిలటరీతోపాటు ప్రైవేటు ఆసుపత్రిలోనూ క్షతగాత్రులకు వైద్యం అందించేలా పడకల సంఖ్యను పెంచడంతో పాటు ఆర్మీ కోసం 25 శాతం పడకలను రిజర్వు చేసి ఉంచాలని కోరింది. పాక్ సర్కారు ఆ దేశ సరిహద్దుల్లోని నీలూమ్, జెహ్లూం, రావల్ కోట్, హవేలీ, కోట్లీ, భింభేర్ ప్రాంతాల్లో ప్రజలకు ఆయా స్థానిక సంస్థల ద్వార ముందస్తు యుద్ధ హెచ్చరికలు చేసింది. భారత్ దాడి చేస్తే దాన్ని తిప్పి కొట్టేందుకు సరిహద్దుల్లో సిద్ధంగా ఉండాలని కోరింది. సరిహద్దు గ్రామాల్లో బంకర్లు లేకుంటే వెంటనే నిర్మించుకోవాలని పాక్ సర్కారు సరిహద్దు గ్రామాల ప్రజలకు సూచించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు సురక్షితమైన మార్గాలను ఎంచుకోవాలని ఆ దేశ సర్కారు పౌరులకు సలహా ఇచ్చింది.