14 నుంచి ఇంటర్‌ అనుబంధ పరీక్షలు

ఏలూరు,మే12(జ‌నం సాక్షి): ఇంటర్‌ అనుబంధ పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ అనుబంధ ప్రయోగ పరీక్షలను ఈనెల 23 నుంచి 27 వరకు ఏలూరులోని సెయింట్‌ థెరిసా జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో ఇంటర్‌ అనుబంధ పరీక్షలను 70 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై ముఖ్య పర్యవేక్షకులు, విభాగాధికారులతో  సమావేశం నిర్వహించారు.  మొదటి సంవత్సర పరీక్షలకు 19375 మంది, రెండో సంవత్సర పరీక్షలకు 8529 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30నుంచి 5.30 గంటలవరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఇదిలావుంటే జూనియర్‌ అధ్యాపకులు డీఏ పెంచాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. జూనియర్‌ అధ్యాపకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. గతంలో ఇచ్చిన కరవు భత్యం కంటే ఇప్పుడు తక్కువ ఇవ్వడానికి నిరసన వ్యక్తం చేశారు.  ఈనేపథ్యంలో ఇంటర్‌ విద్యామండలి అధికారులు జూనియర్‌ అధ్యాపకుల సంఘం నాయకులతో విజయవాడలో నిర్వహించిన చర్చలు ఫలప్రదం కావడంతో జూనియర్‌ అధ్యాపకులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.

తాజావార్తలు