15 వేల మొక్కలు నాటండి

2జీ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కోర్టులు జరిమానాగా సమాజ సేవ చేయాలని ఆదేశించడం ఈ మధ్య సాధారణమైపోయింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఇద్దరు వ్యక్తులు, మూడు కంపెనీలకు ఇలాంటి జరిమానే విధించింది. 2జీ కేసులో కౌంటర్‌ దాఖలు చేయడానికి మరింత సమయం కోరడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒక్కొక్కరు 3 వేల చొప్పున మొత్తం 15 వేల మొక్కలు నాటాలని ఆదేశించింది. ఫిబ్రవరి 15న ఈ మొక్కలు నాటడానికి సంబంధిత అటవీ అధికారిని కలవాలని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి ఓ చివరి అవకాశాన్ని కల్పించింది. మార్చి 26కు కేసు విచారణను వాయిదా వేసింది. 2జీ కేసులో వీళ్లను నిర్దోషులుగా తేల్చడాన్ని సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ ఇద్దరు వ్యక్తులు, మూడు సంస్థలతోపాటు మాజీ టెలికాం శాఖ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను కూడా ట్రయల్‌ కోర్టు నిర్దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే.