17స్థానాల్లో భాజపా పోటీ చేస్తుంది

– ఇప్పటికే 14స్థానాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించాం
– టీఆర్‌ఎస్‌ తాటాకు చప్పుళ్లకు భాజపా భయపడదు
– తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌
న్యూఢిల్లీ, మార్చి11(జ‌నంసాక్షి) : మార్చి 11న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో భాజపా అభ్యర్థులు బరిలోకి దిగుతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసేందుకు తెలంగాణ భాజపా నేతలు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ సోమవారం ఢిల్లీ వచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సంసిద్ధత వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కేసీఆర్‌ దేశంలో ఏదో చేస్తానని చెప్పుకుంటూ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. దేశంలో చక్రంతిప్పడం కాదు.. ముందు తమ ఇల్లు చక్కదిద్దుకోవాలని లక్ష్మణ్‌ సూచించారు. తెరాసలో హరీశ్‌రావుకు కేటీఆర్‌, కేటీఆర్‌కు హరీశ్‌రావు పోటీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ 16 స్థానాల్లో గెలిచినా సాధించేదేవిూ లేదని, వారి తాటాకు చప్పుళ్లకు భాజపా భయపడదని అన్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భాజపా సిద్ధమవుతోందన్నారు. మొదటి విడతలో తెలంగాణ ఎన్నికలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని లక్ష్మణ్‌ తెలిపారు. 17స్థానాల్లోనూ భాజపా పోటీ చేస్తుందని, ఇప్పటికే 14స్థానాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించామన్నారు. ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలని, రాష్ట్రం కోసమో.. సీఎం పదవి కోసమో జరుగుతున్నవి కావన్నారు. ప్రత్యర్థుల ప్రధాని అభ్యర్థి ఎవరంటే సమాధానం లేదని, కేంద్రంలో ఎవరి సహకారం లేకుండా భాజపా అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సంసిద్ధతపై అమిత్‌షాతో చర్చిస్తామని, తెరాసకు ధీటుగా భాజపా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. భాజపాపై వస్తున్న సర్వేలు వాస్తవం కాదని, నోట్ల రద్దు, ఈబీసీలకు రిజర్వేషన్‌,
రైతులకు పెట్టుబడి సాయం వంటివి భాజపాకు మేలు చేస్తాయని లక్ష్మణ్‌ అన్నారు.