20శాతం అదనంగా పెరిగిన ధాన్యం రాక

జనగామ,మే7(జ‌నం సాక్షి): గత రబీసీజన్‌ కన్నా ఈసారి 20శాతం ధాన్యం ఎక్కువగా మార్కెట్‌కు వచ్చినట్లు మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ.1590 కొనుగోలు చేస్తుండగా, సీ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1550కు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం వెల్లువలా తరలివస్తుండగా ఒకవైపు మార్కెట్‌ పాలకమండలితో పాటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈఏడాది సాగునీటి వనరులు ఎక్కువగా పెరగడం వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ మోతాదులో ధాన్యం తరలివచ్చినట్లు మార్కెట్‌ పాలకమండలి సభ్యులు చెబుతున్నారు.
వ్యవసాయ మార్కెట్‌లకు ధాన్యం వెల్లువలా తరలివస్తోంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంతో మార్కెట్‌కు ధాన్యాన్ని భారీగా తరలిస్తున్నారు. మార్కెట్‌కు సెలవులు వస్తే మార్కెట్‌ పనిదినాల్లో అంచనాకు మించి వరి, మొక్కజొన్న తరలిరావడంతో మార్కెట్‌ అంతా కిక్కిరిసి పోయింది. రైతులు మార్కెట్‌కు ధాన్యాన్ని తరలించిన అనంతరం యార్డుల్లో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌లో ఓడీసీఎంఎస్‌ ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చే దాన్యాన్ని తూకం వేసేందుకు హమాలీలు తక్కువగా
ఉండడంతో ఇతర ప్రాంతాల హమాలీలను తీసుకొచ్చేందుకు మార్కెటింగ్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ధాన్యాన్ని తరలించిన రైతులు రోజుల తరబడి మార్కెట్‌లో ఉండాలంటే ఇబ్బందిగా ఉందని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని తూకం వేసేంత వరకు రైతుల బాధ్యతగా భావించాలని లేనిపక్షంలో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని తెలిపారు. రైతులకు కావాల్సిన తాగునీటి తో పాటు ఇటీవల రైతులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని కూడా రైతులకు కల్పించారు.