23కు చేరిన కార్చిచ్చు మృతుల సంఖ్య
గాలి వీయడంతోనే త్వరగా మంటల వ్యాప్తి
కాలిఫోర్నియా,నవంబర్12(జనంసాక్షి): అమెరికాలోని అందమైన ప్రాంతాల్లో ఒకటైన కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఒక ఊరు పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 23కి చేరింది. శుక్రవారం చెలరేగిన కార్చిచ్చు ఘటనలో మృతుల
సంఖ్య పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ ప్రమాదం ధాటికి సుమారు లక్ష ఎకరాల అడవి అగ్నికి ఆహుతైంది. ఒక్క వెంచురాకౌంటీ ప్రాంతంలోనే దాదాపు 15వేల ఎకరాల మేర అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. దీనిపై ఫారెస్టీ, ఫైర్ ప్రొటెక్షన్ విభాగం అధికారి మాట్లాడుతూ..’ బలమైన గాలి వీస్తుండటం కారణంగా కార్చిచ్చు మరింత వ్యాపించింది. 3,200మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. 6,700 భవనాల వరకు మంటల్లో చిక్కుకున్నాయి. పరిస్థితి చక్కబడటానికి సుమారు మూడు వారాలు పట్టవచ్చన్నారు. కార్చిచ్చు రేగిన ప్రాంతంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలుముకుందని తెలిపారు. కార్చిచ్చు ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘ఇంత పెద్ద దుర్ఘటన జరగడానికి కారణమంటూ ఏవిూ లేదు. అటవీ శాఖ నిర్వహణకు ఏటా కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాం. అటవీశాఖ విఫలమయినందువల్లే ఇదంతా. నిధులు ఇస్తున్నా ఇలాంటి ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇకపై ఇలాంటివి నిరోధిస్తే తప్ప ఆయా శాఖలకు నిధుల కేటాయింపు ఉండదు’ అని ట్వీట్ చేశారు.