సహనం నశించిన నేతలు
-మానకొండూరులో బీసీ, రెడ్డి ప్రజా ప్రతినిధుల అంతర్గత సమావేశంతీరు మారకుంటే పార్టీ మారతామని స్పష్టీకరణమండలంలో వన్ మెన్ షో పై తీవ్ర ఆగ్రహం
మానకొండూరు, ఆర్ సి, సెప్టెంబర్ 12 (జనం సాక్షి)నియోజకవర్గ, మండల కేంద్రమైన మానకొండూరులో ఇటీవల అధికార పార్టీకి చెందిన బీసీ రెడ్డి, సామాజిక వర్గ ప్రజా ప్రతినిధుల అంతర్గత సమావేశంపై మండలంలో తీవ్ర స్థాయిలో, చర్చ జోరుగా కొనసాగుతోంది. మరో రెండు నెలల్లో శాసనసభ స్థానానికి సార్వత్రిక ఎన్నికల వేళ, వీరి సమావేశం మండలంలోని రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మండలంలోని ఓ ప్రజా ప్రతినిధి వ్యవహార శైలి, పనితీరుపై, పార్టీలో, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక లో పెత్తనంపై ప్రజా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. భవిష్యత్తులో తీరు మారకుంటే పార్టీని సైతం వీడేయోచన చేయక తప్పదనే, సంకేతాలతో పాటు వారి మనస్థాపానికి, ఆగ్రహానికి, మనోవేదనకు సాక్షాలతో సహా సోదాహరణంగాఎమ్మెల్యే ఎదుటనే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తీరు మారకుంటే పార్టీలో కొనసాగలేమని, సహనానికి సైతం హద్దు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీలో, ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తమని కాదని నేరుగా ఒకరిద్దరు నేతలు అదే పనిగా, అన్నీ తామై వ్యవహరించడం పై జీర్ణించుకోలేక, సార్వత్రిక ఎన్నికలవేళ వారి రాజకీయ భవిష్యత్తు, కార్యాచరణ ప్రణాళికలపై, సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సదాశివపల్లి, కొండపలకల, పోచంపల్లి, ఊటూరు, రంగపేట, వేగురుపల్లి, గట్టుదుద్దెనపల్లి, గంగిపల్లి, లింగాపూర్, వెల్ది గ్రామాలకు చెందిన తాజా, మాజీ ప్రజాప్రతినిధులు మండల కేంద్రంలోని సీడ్ మిల్లు లో సమావేశమయ్యారు. తాము ప్రజా ప్రతినిధుల మైనప్పటికీ, తమను పట్టించుకోవడం లేదని, పార్టీలో, ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో తమకు ప్రాధాన్యత తగ్గిందని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అన్నీ సహించినా ఇకపై తన జోక్యం సహించబోమని, తేల్చి చెప్పడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో ఎంపీపీ, జడ్పిటిసి, మార్కెట్ కమిటీ తదితర స్థానాల్లో పోటీకి తమని లేదా తాము సూచించిన వారికే కేటాయించాలని, తమ మాట చెల్లుబాటు కావాలనే డిమాండ్ తెరపైకి తెచ్చినట్లు వినికిడి. మండలంలో ఒక సామాజిక వర్గ ప్రధాన ప్రతినిధి వ్యవహార శైలి పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, బీసీ , బంధు మైనారిటీ బంధు లబ్ధిదారుల ఎంపికలో తన అనుచర వర్గానికి మొగ్గుచూపారని, తమ ప్రాధాన్యత కొరవడటంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీసీ, మైనార్టీ బందు అర్హులకు ప్రభుత్వ సాయం అందలేదని ఆగ్రహానికి గురైన మైనార్టీలు ఇటీవల మానకొండూరులోని సుప్రీం ఫంక్షన్ హాల్లో తేనేటి విందు ఏర్పాటు చేసి కవ్వంపల్లి సత్యనారాయణ కు మద్దతు తెలిపినట్లు సమాచారం. సదరు నేతకు ఎన్ని మార్లు చెప్పినా తమ మాటను ఖాతరు చేయడం లేదని, గ్రామాల్లో ప్రజలకు నేరుగా జవాబుదారిగా ఉన్నా మాకు సైతం సమాధానం చెప్పే పరిస్థితి కరువైందని వారి మనోభావాలకు, గౌరవానికి, భంగం కలిగిన తీరుపై విడమరచి శాసనసభ్యునికి వివరించినట్లు బోగట్టఒకే సామాజిక వర్గానికి పెద్దపీట. …పార్టీ పదవులు, ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మండల ప్రధాన కార్యదర్శి, మహిళా మండలాధ్యక్షులు, బీఆర్ఎస్ వి, వైస్ ఏఎంసీ, ప్యాక్స్ వైస్ చైర్మన్ ,తదితర స్థానాలతో పాటు సుమారు 10 గ్రామ శాఖ అధ్యక్షులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారేనని గణాంకాలతో సహా వివరించినట్లు తెలిసింది. గ్రామస్థాయి నుండి అందరినీ, ఒకే సామాజిక వర్గంలో ఎంపిక చేసి తమ ప్రాబల్యాన్ని నిరూపించుకోవడం, పెంచుకోవడంతో పాటు, భవిష్యత్తులో మరే ఇతర బీసీ నేతలు ఎదగకుండా, పావులు కదుపుతూ, కనుమరుగు అయ్యేటట్లు , వ్యవహరించటం ఇకపై సహించబోమని తీవ్ర స్థాయిలో నిరసనల గళం వినిపించినట్లు వినికిడి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు మండలంలో డోలాయమానం లో పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉద్యమకారులు, పార్టీలో సీనియర్ నాయకులను కాదని మరో పార్టీలో నుండి వలస వచ్చి, సీనియర్లపై పెత్తనం చెలాయించడంపై సీనియర్ నేతలు జీర్ణించుకోలేక బాహాటంగానే వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అన్ని తమ ఆధీనంలో, కనుసన్నలోనే ఉండాలని, జరగాలని సదరు నేత పెత్తనం, వ్యవహార శైలి, అణిచివేత ధోరణి, ఇకపై సహించబోమని తెగేసి చెప్పిన నేతలకు ,ఇకపై ఇలాంటి పరిస్థితి రానివ్వమని, త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కబడతాయని ఎమ్మెల్యే చే హామీ లభించడం ఈ ఉదంతంలో మరో కొస మెరుపు.