24 గంటల్లో ప్రియాంకా గాంధీని విడుదల చేయండి
` నవజోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం
` నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్
చండీగఢ్,అక్టోబరు 5(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా ఆమెను విడుదల చేయాలని చేసి, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పంజాబ్ నుంచి లఖింపుర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని యూపీ పోలీసులను హెచ్చరించారు. ‘‘రైతుల దారుణ హత్యకు కారణమైన కేంద్రమంత్రి కుమారుడిని రేపటిలోగా అరెస్టు చేయాలి. అన్నదాతల కోసం పోరాడేందుకు వచ్చిన మా నాయకురాలు ప్రియాంక గాంధీని చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఆమెను రేపటిలోగా విడుదల చేయాలి. లేదంటే పంజాబ్ కాంగ్రెస్ లఖింపుర్ ఖేరి వరకు మార్చ్ నిర్వహిస్తుంది’’ అని సిద్ధూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో, ఆదివారం లఖింపుర్ ఖేరీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అక్కడి తికోనియా`బన్బీర్‌పుర్ రహదారిపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా… ఓ కారు వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం రైతులు జరిపిన దాడిలో మరో నలుగురు మృతిచెందారు. ఈ అల్లర్లలో ఓ విలేకరి కూడా ప్రాణాలు కోల్పోయారు. లఖింపుర్ ఖేరి ఘటనలో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని సీతాపూర్ వద్ద పోలీసులు అరెస్టు చేసి, సవిూపంలోని ఓ అతిథి గృహానికి తరలించారు. రైతులపై దూసుకొచ్చిన వాహనం కేంద్రమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్‌ది అని, అందులో ఆయన కూడా ఉన్నారని రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు ఆశిష్ సహా కొందరిపై కేసు నమోదు చేశారు. అయితే ఆయనను ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ప్రియాంకా గాంధీపై కేసు నమోదు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో నలుగురు రైతులు మృతి చెందిన అనంతరం రెండో రోజు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాను లఖింపుర్ చేరకముందే అడ్డుకున్న పోలీసులు.. ఓ గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు యూపీ పోలీసులు వెల్లడిరచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే కారణంగా ఆమెతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశామని స్థానిక హర్గావున్ పోలీసులు పేర్కొన్నారు.ఎటువంటి ఎఫ్‌ఐఆర్, వారెంట్ లేకుండానే పోలీసులు 28గంటలుగా తనను నిర్బంధించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఉదయం ఓ వీడియో విడుదల చేశారు. ఇదే సమయంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు లఖ్‌నవూ వచ్చిన ప్రధాని మోదీ.. బాధిత కుటుంబాలను పరామర్శించాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు తమ నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ నిర్బంధించడంపై యూపీ పోలీసులు స్పందించారు. సెక్షన్ 144 అమలులో ఉన్న సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోనే ఆమెతో పాటు మరో పదిమందిపై ఐపీసీ సెక్షన్ 107/16 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే, అక్టోబర్ 4వ తేదీ ఉదయమే ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకొగా.. ప్రస్తుతం ఆమె ఉన్న సీతాపూర్‌లోని పీఏసీ గెస్ట్‌హౌస్‌నే తాత్కాలిక జైలుగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను తెలియజేస్తూ జిల్లా మెజిస్ట్రేట్‌కు హర్గావున్ పోలీసులు నివేదిక అందించినట్లు తెలస్తోంది.కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని నిర్బంధించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఉదయం 4.30 ప్రాంతంలో ప్రియాంకా గాంధీని అరెస్టు చేయడం అక్రమణం, సిగ్గుచేటు అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విమర్శించారు. అంతేకాకుండా ఇప్పటివరకూ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇక ప్రియాంక గాంధీని కలిసేందుకు సీతాపూర్ బయలుదేరిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను లఖ్‌నవూ విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఎయిర్‌పోర్టులోనే సీఎం బైఠాయించారు.