కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లకే మళ్లీ ఎమ్మెల్సీ..!!
అపోహలకు తావులేకుండా త్వరలోనే కేబినెట్‌ నిర్ణయం?
హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ విషయంలో హైకోర్టు తీర్పు ఎట్టకేలకు ఈ వివాదానికి స్పష్టతనిచ్చింది. వారి నియామకానికి సంబంధించిన పిటిషన్‌ గత కొన్ని వారాలుగా న్యాయస్థానంలో పెండిరగ్‌లో ఉండగా.. వారిద్దరిని నియమించడాన్ని హైకోర్టు ఏమాత్రం తప్పుబట్టలేదు. కేవలం పున:సమీక్షించుకోవాలని సూచనలు చేసింది. దీంతో తిరిగి వారిద్దరిని మళ్లీ నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై సోషల్‌ మీడియాలో వ్యాపిస్తున్న కొన్ని అపోహలకు తావులేకుండా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లకే మళ్లీ ఎమ్మెల్సీ అవకాశం కల్పించేందుకు సీఎం రేవంత్‌ సర్కార్‌ యోచిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే కేబినెట్‌ సమావేశంలో తీర్మానించి తిరిగి గవర్నర్‌ ఆమోదానికి పంపనున్నట్టు సమాచారం.