27న ఎన్డీయేతర పక్షాల భేటీ

ఉమ్మడి కార్యాచరణపై ప్రణాళిక
న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలకాంశాలపై చర్చించేందుకు ఎన్డీయేతర పక్షాలు ఈనెల 27న దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయా పార్టీల నేతలు కూర్చుని భవిష్యత్‌ ఖరారు చేయనున్నారు. ఉమ్మడి కార్యాచరణెళి లక్ష్యంగా ఈ భేటీ జరుగనుందని తెలుస్తోంది. ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు పార్లమెంటు అనుబంధ భవనంలో నిర్వహించే ఈ సమావేశానికి రాహుల్‌గాంధీతో పాటు ఆంధప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ; కేంద్ర మాజీ మంత్రులు శరద్‌పవార్‌, ఫరూఖ్‌అబ్దుల్లా; దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌జేడీ, ముస్లింలీగ్‌, వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీయేని దీటుగా ఎదుర్కోవడానికి వీలుగా దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన ఉమ్మడి ర్యాలీలు.. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశాలపై కూడా ఈ భేటీలో స్పష్టమైన కార్యాచరణ రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముందస్తు కూటమితో ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల శరద్‌పవార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో దానిపై తదుపరి కార్యాచరణ విషయమై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన మిత్రపక్షాలు దాని ముసాయిదా రూపకల్పన బాధ్యతను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అప్పగించిన నేపథ్యంలో ఈ విషయమై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.