28న మోసం చేస్తే .. బాబు యాత్ర తెలంగాణలో ఇంచుకూడా కదలనివ్వం

కాంగ్రెస్‌ మాటతప్పితే ఎంపీలుగా బాధ్యత తీసుకుంటాం
– ఎంపీ పొన్నం ప్రభాకర్‌
కరీంనగర్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) :
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న నిర్వహించే అఖిలపక్ష సమవేశంలో మోసం చేస్తే ఈ ప్రాంతంలో చంద్రబాబునాయుడు పాదయాత్రను ఇంచుకూడా కదల నివ్వబోమని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో పట్టుకోసం పాకులాడుతున్న తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతలు చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి ప్రజల ఆకాంక్షపై స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. 28లోగానే ఆ పార్టీలు తమ వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా ఓట్లు సీట్లు రాజకీయా లు చేస్తే చూస్తూ ఊరుకోబో మన్నారు. ఒకవేళ అఖిలపక్షంలో కాంగ్రెస్‌ పార్టీ గనుక మోసం చేస్తే పార్లమెంట్‌ సభ్యులుగా తామే బాధ్యత తీసుకుంటామన్నారు. మిగతా పార్టీల్లోని తెలంగాణ నేతలు కూడా తమ అధినాయకత్వాలపై ఒత్తిడి తెచ్చి స్పష్టమైన ప్రకటన చేయించాలని కోరారు. లేకుంటే ఇక్కడి ప్రజలు వారిని ఉపేక్షించబోరని అన్నారు.
ఏకాభిప్రాయం చెప్పాల్సిందే : వివేక్‌
హైదరాబాద్‌ : అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణపై ఏకాభిప్రాయం చెప్పాలిందేనని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ వివేకానంద అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షంలో భిన్న స్వరాలు పలికే పార్టీలకు ఈ ప్రాంతంలో కాలం చెల్లినట్టేనని అన్నారు. ఇంకా మోసం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుబోరని అన్నారు