30మంది భారతీయఖైదీలను విడుదల చేసిన పాక్
ఇస్లామాబాద్,ఆగస్ట్13(జనం సాక్షి): పాక్ జైళ్లలో మగ్గుతున్న భారత్ పౌరుల్లో కొందరికి ఆ దేశ ప్రభుత్వం విముక్తి కల్పించింది. సోమవారం 30 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. ఇందులో 27 మంది చేపలు పట్టుకునే జాలర్లు ఉన్నారు. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసినట్లు తెలిపింది. మానవతా దృక్పథంతో వీరిని విడుదల చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 470 మంది భారతీయులు పాక్ కారాగారాల్లో బందీలుగా ఉండగా అందులో 418 మంది మత్స్యకారులేనని జులైలో ఆదేశ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పాక్ ప్రభుత్వం వెల్లడించింది. పాక్ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన జాలర్లను సంబంధింత భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసినట్లు పాక్ పేర్కొంది. ఖైదీలను కరాచీలోని మాలిర్ జైలు నుంచి కాంట్ రైల్వే స్టేషన్‌కు తరలిస్తామని అక్కడ నుంచి లా¬ల్ తీసుకెళ్తామని చెప్పింది. అనంతరం వాఘా సరిహద్దులో భారత సరిహద్దు భద్రతా దళానికి జాలర్లను అప్పగిస్తామని వివరించింది.