59 కంపెనీలపై సెబీ వేటు

prvzbo76క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ.. తాజాగా మరో 59 సంస్థలపై కొరడా ఝుళిపించింది. స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో పన్ను ఎగవేత అక్రమాలకు పాల్పడ్డాయంటూ ఈ సంస్థలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి నిషేధించింది. వీరిపై లోతైన దర్యాప్తు కోసం ఆదాయం పన్ను శాఖకు సెబీ వివరాలు అందించింది. నిషేధం విధించిన జాబితాలో రిద్ధిసిద్ధి బులియన్స్, వుడ్‌ల్యాండ్ రిటైల్స్, మహాకాళేశ్వర్ మైన్స్, శిర్ కమోడిటీస్ అండ్ ఫ్యూచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతోపాటు అశోక్ కుమార్ దామని, జైదీప్ హల్వాసియా ఇంకా కొంతమంది హై నెట్‌వర్త్ ఇండివిజువల్స్(హెచ్‌ఎన్‌ఐ) కూడా ఉన్నారు. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో స్టాక్ ఆప్షన్లలో రివర్సల్ ట్రేడ్ ద్వారా కొన్ని సంస్థలేమో ఎప్పుడూ నష్టపోయినట్లు, మరికొన్నేమో ఎప్పుడూ లాభాలు ఆర్జించినట్లు తమ దృష్టికి వచ్చిందని సెబీ అంటున్నది. అయితే వీరు ఎప్పుడూ లాభాలు ఆర్జించడం లేదా నష్టపోవడానికి గల కారణాలను మాత్రం సరిగా వివరించలేకపోయారని తెలిపింది. ఇప్పటికే సెబీ 950కి పైగా కంపెనీలపై నిషేధం విధించింది. తాజా ఆదేశాలతో నిషేధం విధించిన సంస్థల సంఖ్య 1000కి చేరుకుంది.