చెన్నై ఆటోల్లో జీపీఎన్‌: దేశంలో తొలిసారి

చెన్నై: దేశంలోనే మొదటి సారిగా చెన్నై నగరంలోని ఆటోల్లో జీపీఎన్‌ సౌకర్యంతో మీటర్లు అమరుస్తున్నారు. వీటికి ఎలక్ట్రానిక్‌ డిజిటల్‌ ప్రింటర్‌ కూడా ఉంటుంది. ప్రయాణీకులు చెల్లించాల్సిన చార్జీ, ప్రయాణించిన దూరం వివరాలతో ప్రింట్‌ ఇస్తారు. జీపీఎస్‌ ఉండడం వల్ల ఆటో ఎక్కడ ఉన్నదీ కనుగొనడం తేలిక. ఛార్జీలు కాస్త ఎక్కువనిపించినా, భద్రత భయం, బేరసారాల గొడవ లేకుండా ప్రయాణించవచ్చన్నది ప్రభుత్వం ఆలోచన. ఆటోల కనీస చార్జీని 25 రూపాయలకు పెంచారు. కొత్త మీటర్లతో ఆటోల ఆధునికీకరణ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వమే రూ.80 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఈ కొత్త పధకాన్ని ఆరంభించారు. సవరించిన ఛార్జీలు కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.