‘మీరు దోచుకుపోతుంటే మేం చూస్తూ కూర్చోవాలా’? : నాగం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోమని బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం కిరణ్‌ హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో మా కార్యాలయాలకు వెళ్లాలంటే అనుమతి కావాలా? అని ఆయన నిలదీశారు. మీరు దోచుకు పోతుంటే మేం చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. మా కార్యాలయాల్లో మా ఉద్యోగులపై దాడి చేస్తారా? అని దుయ్యబట్టారు. ఇకపై తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరుగుతుంటే చూస్తూ కూర్చోమని ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించారు.
సమైక్యం ఇకలేదు, సమైక్యవాదమనే దినాలు పోయినయి అని నాగం అన్నారు. సమైక్యం అంటే అది తెలంగాణ ప్రజల నుంచి కూడా రావాలికదా, మీకు మీరు సమైక్యమంటే ఎట్లా? అని అన్నారు. సామరస్యంగా విడిపోదామని, సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.