పెను తుపానుగా మారనున్న ‘మేడి’ తుపాను

హైదరాబాద్‌: నైరుతి బంగాళాఖాతంలో మేడి తుపాను స్థిరంగా కదులుతున్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడి 24 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో 48 గంటల్లో ఉత్తరదిశగా కదిలి… దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనించే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నై ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఓడరేవుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.