కాంగ్రెస్‌ను సాగనంపితేనే అభివృద్ధికి సాధ్యం : మోడీ
ముంబయి: కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి కలిగించినప్పుడే అభివృద్ధి సాధ్యమని భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ముంబయిలోని ఎంఎంఆర్‌ఏ మైదానంలో జరిగిన సమర శంఖారావం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. గతంలో గుజరాత్ మహారాష్ట్రలో అంతర్భాగంగా ఉండేదని, అందువల్ల మహారాష్ట్ర తమకు పెద్దన్నలాంటిదని, గుజరాతీలకు ముంబయి మరో నివాసమని అన్నారు. కాంగ్రెస్ పాలన వల్ల ఏళ్లు గడిచినా దేశంలో నీటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు స్వస్తి పలకాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. భాజపా అభివృద్ధి రాజకీయాలకు కట్టుబడి ఉందని, అయితే కాంగ్రెస్‌కు అభివృద్ధి రాజకీయాలపై నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. బడుగు, బలహీన వర్గాలు, దళితులకు ఇప్పటికీ అభివృద్ధి ఫలాలు దక్కలేదని ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ విభజించు-పాలించు విధానాన్ని అవలంభిస్తోందన్నారు. అవినీతి, అక్రమాలను పెంచి పోషిస్తోందని విమర్శించారు.