నేడే ‘పరిషత్‌’ తొలి సమరంపట్టుకోసం పాకులాట!

అంతా.. నిశ్శబ్దంగా..

తెలంగాణాలో 226 స్థానాల్లో…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 :

మరికొన్ని గంటల్లో ‘స్థానిక’ తొలివిడత పోలింగ్‌కు తెరలేవనుంది. రాష్ట్ర వ్యాప్తంగా  మండలాల్లో తొలివిడత పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ప్రచారం ముగియడంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. పట్టు కోసం పాకులాడుతున్నారు.  పరువు దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్న చోట ఓటుకు వెయ్యి రూపాయల వంతున పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. నగదు తీసుకోబోని వారికి గృహోపకరణాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.9 పగలు, రాత్రి తేడా లేకుండా ఆయా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిన కొనసాగనున్నాయన్న విషయం తెలిసిందే. జడ్పిటిసి అభ్యర్థులకు తెలుపు బ్యాలెట్‌ పత్రాన్ని, ఎంపిటిసి అభ్యర్థులకు గులాబి బ్యాలెట్‌ పత్రాన్ని సిద్ధం చేశారు. ప్రాదేశిక ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగనున్నాయి.  తెలంగాణాలో 226 స్థానాల్లోను ఆదివారం పోలింగ్‌ జరగనుంది.

సామాగ్రి పంపిణీ

తొలివిడత పోలింగ్‌ జరగనున్న అన్ని మండలాల్లోనూ పోలింగ్‌ సామాగ్రిని ఎన్నికల విధులకు హాజరు కానున్న అధికారులకు, సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఇవిఎంల వినియోగంపై అవగాహన కల్పించారు.

అదిలాబాద్‌ జిల్లాలో..

మంచిర్యాల, ఆసిఫాబాద్‌ డివిజన్లలోని 21 మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసీలకు ఎన్నిక జరగనుంది. 21 జడ్పిటిసిల కోసం 108 మంది, 263 ఎంపిటిసి స్థానాల కోసం 1176మంది బరిలో ఉన్నారు.

కరీంనగర్‌ జిల్లాలో..

పెద్దపల్లి, మంథని, జగిత్యాల డివిజన్లలో సమరం జరగనుంది. 30 జడ్పిటిసి స్థానాలకు, 409 ఎంపిటిసి స్తానాలకు ఎన్నిక జరగనుంది.  1294 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,16,165మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  30 జడ్పిటిసి పదవులకు 183మంది, 409 ఎంపిటిసి స్థానాలకు 1790మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఖమ్మం జిల్లాలో..

ఏజెన్సీలోని నాలుగు మండలాలపై అందరి దృష్టి పడింది. జడ్పి పీఠంపై కూర్చోవాలంటే నాలుగు మండలాల్లో ఒక్క జడిపిటిసి స్థానమైనా గెలవాల్సిందే. జడ్పి చైర్‌పర్సన్‌ స్థానం ఎస్‌సి మహిళకు రిజర్వు అయిన విషయం తెలిసిందే. వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక మండలాల జడ్పిటిసి స్థానాలు ఎస్‌సి మహిళలకు రిజర్వు అయ్యాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో..

నాగర్‌కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని 35 మండలాల్లో ఆదివారం పోలింగ్‌ జరగనుంది. నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, ఆలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 35 మండలాల్లో ఎన్నిక జరగనుంది. 35 జడ్పిటిసి స్థానాలకు గాను 141మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే ఎంపిటిసి స్థానాలకు 1593మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

మెదక్‌ జిల్లాలో..

24 జడ్పిటిసి స్తానాలకు.. 354 ఎంపిటిసి స్తానాలకు ఎన్నిక జరగనుంది. 1149 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నల్గొండ జిల్లాలో..

కోదాడ, హూజూర్‌నగర్‌, సూర్యాపేట డివిజన్‌లలోని 33 మండలాల పరిధిలోని 33 జడ్పిటిసి స్థానాలకు, 473 ఎంపిటిసి స్థానాలకు ఎన్నిక జరగనుంది. వాటిల్లో 14 ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. 11,94,433 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 459 ఎంపిటిసి స్థానాలకు 1699 మంది అభ్యర్థులు, 33 జడ్పిటిసి స్థానాలకు 213మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 3292 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. 908 ప్రాంతాల్లో 1554 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నిజామాబాద్‌ జిల్లాలో..

18 మండలాల్లో ఎన్నిక జరగనుంది. జడ్పిటిసిల బరిలో 92మంది, 298 ఎంపిటిసిలకు గాను 1105మంది రంగంలో ఉన్నారు. 911 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వరంగల్‌ జిల్లాలో..

20 మండలాల్లో ఎన్నిక జరగనుంది. ఎక్కువ స్థానాల్లో త్రిముఖ పోరు నెలకొంది. నర్సంపేట డివిజన్‌లోని 7, ములుగు డివిజన్‌లోని 13 మండలాల్లో పోలింగ్‌ జరగనుంది.