కాషాయం గూటికి చంద్ర‌బాబు

హైద‌రాబాద్ జ‌నంసాక్షిః
బీజేపీతో పొత్తుకు ముందు అప్పటికి, ఇప్పటికి ఏం మారిందో చంద్రబాబు సెలవిస్తే బాగుండేది. అయినా బీజేపీ, టీడీపీల పొత్తుపై సగటు ఓటరు స్పందన పక్కన పెడితే.. ఇరు పార్టీల నేతలు, రెండు ప్రాంతాల్లోనో గుస్సాగా ఉన్నట్టు పొత్తుపై భేటికి ముందే కార్యకర్తలు ఆగ్రహంతో ఉవ్వెత్తున లేచారు. దాంతో కార్యకర్తలు అడ్డుకునేందుకు చంద్రబాబు ఇంటి వద్ద ముళ్ల కంచే వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఎంటో ఒకసారి ఆలోచించుకోవాలి.
 బీజేపీ కారణంగానే  2004 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి పాలైందని దుమ్మెత్తి పోసిన చంద్రబాబు నాయుడు తాజాగా మళ్లీ కాషాయం గూటికి చేరారు. మతతత్వ పార్టీగా బీజేపీని తూర్పార పట్టిన చంద్రబాబు.. దేశ ప్రయోజనాల కోసమే పొత్తు అంటూ కొత్త రాగాన్ని వినిపిస్తున్నారు.  రెండు ప్రాంతాల్లో ఏపార్టికి లేనటువంటి విచిత్రమైన పరిస్థితి  తెలుగుదేశం పార్టీది.  రాష్ట్ర విభజన అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించడం కారణంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీపై ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు. ఇక రాష్ట్ర విభజన కారణమైన జాతీయ పార్టీలలో బీజేపీది కీలకపాత్ర అని సీమాంధ్ర ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. అలాంటి పార్టీతో దోస్తి కట్టడం ప్రమాదకరమే అనే భావనలో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఈ పొత్తుపై ఆందోళనతో ఉన్నారు.
 టీడీపీ, బీజేపీ పొత్తుతో సీట్లు కోల్పోయే నేతల నిరసనతో చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సర్దుబాటుతో టీడీపీకి మైనారిటీలు ఓటు బ్యాంకు దూరమయ్యే ముప్పు మరోవైపు పొంచి ఉందని నేతల అంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పొత్తు వ్యవహారం టీడీపీ కొరివితో తలగొక్కునట్టేనని ఆపార్టీ నేతల అభిప్రాయం. అంతేకాకుండా పొత్తు పొడవడానికి కొద్ది సేపటి ముందే ఆపార్టీకి చెందిన నేత మైనంపల్లి హన్మంతరావు గుడ్ బై చెప్పారు. పలు విధాలుగా వ్యతిరేక వెల్లువెత్తుతున్న సమయంలో కాషాయం గూటికి చంద్రబాబు చేరడం ఆపార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. బీజేపీ పొత్తుతో లాభించే అంశాల కన్నా..టీడీపీకి నష్టమేనని పచ్చదళం మండిపడుతోంది. ఓసారి కార్గిల్ వార్ కారణంగా బీజేపీ పొత్తు పెట్టుకుని లాభపడ్డ చంద్రబాబు.. మోడీ హవాను పొత్తుతో క్యాష్ చేసుకునేందుకు వెంపర్లాడుతున్న చంద్రబాబుకు ఈసారి భంగపాటు తప్పదని మెజార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఐతే బీజేపీ నేతల పరిస్తితి మరో విధంగా ఉంది. రాష్ట్ర విభజన అంశంలో చంద్రబాబు డబుల్ యాక్షన్ తో తెలంగాణలో టీడీపీపై ఉన్న ప్రజల ఆగ్రహం వల్ల బీజేపీకి నష్టం తప్పదని కాషాయదళం నేతలు పార్టీకి హెచ్చరిస్తున్నారు. అలాగే రాష్ట్ర విభజనకు ఓకే అంటూ తలూపి.. రాజధాని కోసం లక్షల కోట్లు డిమాండ్ చేసిన చంద్రబాబుపై సీమాంధ్రలోనూ అంతేమొత్తం కోపం ఉంది. ఇలాంటి కారణంగా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ నేతలు రెండుగా చీలినట్టు సమాచారం. ఐనా కేంద్ర నాయకత్వం ఈ కీలక ఎన్నికల సమయంలో పొతుతో ముందుకు పోవడం రెండు ప్రాంతాల్లోనూ చంద్రబాబుతో పొత్తు బీజేపీకి నష్టమేనని కమలనాథులు ఆందోళనలో పడ్డారు.