కేజ్రీవాల్ కు ఢిల్లీలో మరోసారి చేదు అనుభవం

న్యూఢిల్లీ: ఆప్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కు దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌పై ఓ ఆటో డ్రైవర్ దాడికి యత్నించాడు. ఢిల్లీలోని  సుల్తాన్ పురిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. అగంతకుడు జరిపిన దాడిలో కేజ్రివాల్ కంటికి గాయమైంది. గాయం కారణంగా కన్ను ఉబ్బడంతో ప్రచారాన్ని కేజ్రివాల్ అర్ధాంతరంగా ముగించాడు. దాడి చేసిన వ్యక్తిపై ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ప్రతిదాడి చేశారు.  ఆమ్ ఆద్మీ పార్టీ టోపి పెట్టుకున్న ఆటో రిక్షా డ్రైవర్ దాడికి పాల్పడినట్టు ఆప్ నేతలు తెలిపారు. ఆటో డ్రైవర్ ను తర్వాత పోలీసులకు అప్పగించారు. తమను ఎదుర్కోలేకనే ఆప్ నేతలపై బీజేపీ నేతలు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దాడి తర్వాత రాజ్ ఘాట్ కు వెళ్లి నిరసన తెలిపారు.  ఏప్రిల్ 5 తేదిన ఢిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో ఓ యువకుడు కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దాడి జరగడంతో ఆరోజున ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తన రోడ్ షోను హఠాత్తుగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.