చెన్నయ్ రైల్వే స్టేషన్‌లో జంట పేలుళ్లు
తమిళనాడు, మే 1 : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గురువారం ఉదయం జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. బెంగుళూరు నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్ ఫ్లాట్‌ఫాం 9పై ఆగివున్న సమయంలో రైలులోని ఎస్-4,5 బోగీలలో పేలుళ్లు జరిగాయి. ఈ పేలుడులో ఓ యువతి మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన యువతి గుంటూరు జిల్లాకు చెందిన స్వాతి(22)గా గుర్తించారు. గాయపడినవారిలో విశాఖకు చెందిన యువతి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం 7.15కు మొదటి పేలుడు సంభవిచగా, మరి కొన్ని నిమిషాలలో మరో పేలుడు సంభవించింది. వెంటనే బాంబు స్క్వాడ్ అక్కడికి ఏరుకుని విస్తృత తనిఖీలు చేపట్టింది. పేలుళ్లలో గాయపడిన వారి వివరాల కోసం హెల్ప్‌లైన్ : 044-25357398 ఏర్పాటు చేశారు.
నిన్న(బుధవారం) చెన్నైలో ఐఎస్ఐ ఉగ్రవాది జకీర్ హుస్సేన్ అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇది ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఇంత వరకూ ఏ టెర్రరిస్టు సంస్థా బాధ్యత స్వీకరిస్తూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి శ్రీలంక మీదుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం.
ఈ బాంబు పేలుడు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేసించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అనుమానాస్పదునిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా ఖండిచారు.
పేలుడు సంభవించిన రెండు బోగీలను రైలు నుంచి తొలగించిన అధికారులు కొత్త బోగీలను ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో రైలు తిరిగి బయలుదేరనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.