తడిసి ముద్దయిన తెలంగాణ


నోటికాడి ముద్ద నీళ్లపాలు
భారీగా పంటనష్టం
చిత్తడిగా రాజధాని
హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) :
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ తడిసిముద్దయింది. రాష్ట్రంలో కురుస్తున్న అకాలవర్షాలు మరోమారు అన్నదాతను కుదేలు చేశాయి. జోరుగా కురుస్తున్న కుండపోత గుండెకోతను మిగిల్చింది. గురవారం రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో ఊహించని ఆస్తి నష్టం సంభించింది. లక్షలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీటి పాలైంది.కల్లాల్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోయి కొందరు ఏడుస్తుంటే, మార్కెట్‌ యార్డులకు తడిసిన ధాన్యంతో మరికొందరు దైన్యంలో మునిగిపోయారు. ఇక కోతకు వచ్చిన వరిచేలు వంగిపోయింది. మొత్తంగా రైతన్నను నట్టేట ముంచాయి. రంగారెడ్డిలో కరెంట్‌ విద్యుత్‌ తీగలు పడి ఒకరు మృతి చెందారు. ఇదిలావుంటే రానున్న 48 గంటల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. అకాల వర్షం అన్నదాతల పాలిట శాపంగా మారింది. తెలంగాణ ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. మార్కెట్‌ యార్డుల్లో విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లోనే, వరిపొలాల్లోనే ధాన్యం ఉండిపోయింది. మార్కెట్‌ యార్డులో విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం, పసుపు, సజ్జ తడిసిపోయాయి. వర్షాలకు జన జీవనం స్తంభించింది. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లు, విద్యుత్‌ లైన్లు నేలమట్టమయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.నల్లగొండ, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం తీవ్ర నష్టం కలిగించింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం అతలాకుతలమైంది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి భారీ నష్టం సంభవించింది. వరి, పసుపు, పత్తి పంటలు నీట మునిగాయి. వర్షంతో పాటు ఉద్ధృతంగా గాలులు వీయడంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో వందలాది గ్రామాలకు కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. నిజామబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయింది. నవీపేట మండలంలో 300 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఆదిలాబాద్‌ జిల్లాలో కురిసిన వర్షాలతో పసుపు, నువ్వు, వరిపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 5 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. మార్కెట్‌ యార్డులో ప్లాట్‌ఫాంలు సరిగా లేక వర్షం నీరంతా ధాన్యం కుప్పల కింద నిలిచిపోయింది. సుల్తానాబాద్‌ మార్కెట్‌ యార్డులో 3 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో కొనుగోలు చేసిన 4 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. చేతికందిన పంట నీట మునగడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.
జలమయమైన రాజధాని..
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కుండపోత వాన కురిసింది. భారీ వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధాన రహదారులలో కూడా నీరు బాగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, సెక్రటేరియట్‌, బేగంపేట-పంజగుట్ట, అవిూర్‌పేట రహదారుల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ జామైంది. రోడ్ల పైకి నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తప్పలేదు. దీంతో జన జీవనం స్తంభించింది. ఇటు హైటెక్‌ సిటీ రైల్వే బ్రిడ్జి వద్ద నీరు ఏరులై పారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైటెక్‌సిటీ, మాదాపూర్‌ వెళ్లాల్సిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆయా ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. రాత్రి మొదలై శుక్రవారం ఉదయం వరకు భారీగా వర్షాలు పడ్డాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వివిధ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి తోడు మెట్రోరైల్‌ నిర్మాణపనులు జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కర్ణాటకను ఆనుకొని తూర్పు మధ్య అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడినన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. అల్పపీడనం 24 గంటల్లో క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పలు చోట్ల, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దట్టమైన క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావం వల్ల పిడుగులు పడే అవకాశం ఉందని, పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు. వర్షం కురిసే సమయంలో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల పంటనష్టం వాటిల్లే అవకాశముందని అధికారులు వివరించారు. తెలంగాణ, కోస్తా జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆగ్నేయ అరేబియా మహాసముద్రంలోని కామరూన్‌ వద్ద రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం గురువారం కేరళ సవిూపంలో కేంద్రీకృతమైంది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదలొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం నుంచి కర్ణాటక విూదుగా మహారాష్ట్ర వరకు మరో ద్రోణి కదులుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తా జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రత్యేకించి శనివారం కోస్తా, తెలంగాణలలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే వీలుందని పేర్కొన్నారు. రాయలసీమలోనూ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అయితే దీని ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఉండి, పాలకొల్లు, ఉండ్రాజువరం, భీమవరం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటి వరకు భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వర్షం కారణంగా ధాన్యం తడిచి రైతులు ఇబ్బంది పడ్డారు. కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 5వేల క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. మార్కెట్‌యార్డులో ప్లాట్‌ఫాంలు సరిగా లేక వర్షం నీరంతా ధాన్యం కుప్పల వద్దే నిలిచిపోయింది. కరీనంగర్‌ జిల్లా సుల్తానాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సుమారు 3వేల క్వింటాళ్ల ధాన్యం వర్షంలో తడిసిపోయింది. అమ్ముకునేందుకు తెచ్చిన పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో వేలాది ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. నిజామాబాద్‌ గ్రావిూణం, బాల్కొండ, కామారెడ్డి, బోధన్‌ నియోజకవర్గాల్లోనూ ధాన్యం కుప్పలు వర్షపు నీటిలో తడిసిపోయాయి.డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నవీపేట మండలంలో కోతకు వచ్చే దశలో ఉన్న దాదాపు 300 ఎకరాల్లో వరి దెబ్బతింది.ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మణచాందా మండలంలో కురిసిన వర్షానికి పసుపు రైతులు నష్టపోయారు. కల్లాల్లో ఆరబోసిన పసుపు పూర్తిగా తడిసిపోయింది. నువ్వుపంట పాక్షికంగా దెబ్బతింది. తడిసిన పసుపును అధికారులు పరిశీలించి నష్టపరిహారాన్ని అందజేయాలని రైతులు కోరుతున్నారు. వరంగల్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌, కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారులు టార్పాలిన్‌ పట్టాలు ఇవ్వకపోవడం వల్లే ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతుల నుంచి కొనుగోలు చేసి సుమారు 4వేల క్వింటాళ్ల దాన్యం తడిసినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల్లో లోడింగ్‌ కోసం సిద్దం ఉంచగా వర్షానికి తడిసిపోయాయి.