టి-లో కాంగ్రెస్, సీమాంధ్రలో టిడిపి హవా
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్, వైఎస్ఆర్‌సి వెనుకంజ
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రలో తెలుగు దేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగురవేశాయి. సోమవారం తెలంగాణ, సీమాంధ్రలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల వోట్ల లెక్కింపు మొదలైంది.తెలంగాణలో తొమ్మిది మున్సిపాలిటీలను కాంగ్రెస్ చేజిక్కించుకోగా ఐదు మున్సిపాలిటీలను టిఆర్ఎస్ గెలుచుకుంది. అనేక మునిసిపాలిటీలలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.కాగా, తెలంగాణలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో కరీంనగర్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పరం కాగా, నిజామాబాద్, రామగుండంలో కాంగ్రెస్ విజయపథంలో ఉంది.తెలంగాణలో ఇప్పటివరకు కొనసాగిన వోట్ల లెక్కింపులో కాంగ్రెస్ 394 స్థానాలను, టిఆర్ఎస్ 245 స్థానాలను గెలుచుకున్నాయి. టిడిపి 129 స్థానాలను, ఇతరులు 256 స్థానాలను గెలుచుకున్నాయి.సీమాంధ్రలో, టిడిపి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ముందంజలో ఉంది. కాగా, కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.సీమాంధ్రలోని 36 మున్సిపాలిటీలలో టిడిపి విజయకేతనం ఎగురవేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన 7 మున్సిపల్ కార్పొరేషన్లలో చిత్తూరును టిడిపి గెలుచుకుని మరో రెండు కార్పొరేషన్లలో ముందంజలో ఉంది. ఇప్పటివరకు జరిగిన వోట్ల లెక్కింపు ప్రకారం టిడిపి 934 స్థానాలను గెలుచుకోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 634 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 45 స్థానాలను గెలుచుకుంది.మార్చి 30న తెలంగాణ, సీమాంధ్రలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 146 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన వోట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 155 కేంద్రాలలో వోట్ల లెక్కింపు జరుగుతోంది.తెలంగాణలో 56 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు, సీమాంధ్రలో 90 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి.
Topics: మున్సిపల్ ఎన్నికలు, కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ, సీమాంధ్ర, Municipal Elections, Congress, TDP, Telangana, Seemandhra