కర్నూలు : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన బుధవారం మధ్యాహ్నం మంత్రాలయం పరిధిలో తీవ్ర కలకలం రేపింది. మృతులలో ఒక మహిళ ముగ్గురు పురుషులు ఉన్నారు. మంత్రాలయం సిఐ ప్రకాష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకకు చెందిన మహిళ(45), ఆమె ముగ్గురు కుమారులు గత మూడు రోజుల క్రిందట మంత్రాలయానికి వచ్చారు. బుధవారం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్న అనంతరం వారు ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అక్కడ వారితో పాటు తెచ్చుకున్న అరటిపళ్ళలో విషం కలుపుకుని అందరూ కలిసి తిన్నారు. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా బుధవారం మధ్యాహ్నం కొంత మంది చిన్నారు నది వద్దకు ఆడుకోవడానికి వెళ్లగా అక్కడ మృతదేహాలు కనిపించడంతో పెద్దలకు సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియరాలేదని, వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, ముబైల్స్ లభించలేదని సిఐ తెలిపారు. ఈ ఘటనపై మంత్రాలయం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.