టెన్షన్.. టెన్షన్
ఫలితాలు24 గంటలు
మనకే టర్నయ్యింది : తెరాస
మునిసిపల్ ఫలితాలే రిపీటయితై : కాంగ్రెస్
పైకి గాంభీర్యం.. లోలోపల మదనం
మిత్రుల కోసం ఇరు పార్టీల మంతనాలు
హైదరాబాద్, మే 14 (జనంసాక్షి) :
అన్ని పార్టీల్లో హై టెన్షన్ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటా అన్ని పార్టీలు మదన పడుతున్నాయి. పైకి తామే అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం గుబులు చెందుతున్నారు. 16వ సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ, సీమాంధ్ర ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు తొమ్మిది విడతల్లో నిర్వహించగా, తెలంగాణలో ఏడో విడతలో భాగంగా ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించారు. సీమాంధ్రలో ఎనిమిదో విడతలో భాగంగా మే 7న పోలింగ్ జరిగింది. తెలంగాణలోని 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఇక సీమాంధ్రలోని 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపడింది. తెలంగాణలో బలీయశక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. తెలంగాణలో ఎగ్జిట్‌పోల్స్ ఉద్యమ పార్టీ సొంతంగానే అధికారం చేజిక్కించుకుంటుందని లెక్కలు తేల్చగా కాంగ్రెస్ పార్టీ సైతం తామేమి తక్కువ కాదంటోంది. సొంతంగానే అధికారంలోకి వస్తామని అవసరమైతే ఎంఐఎం, సీపీఐల మద్దతు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఇప్పటికీ టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కలిసి మద్దతు కోరారు. మరోవైపు టీఆర్‌ఎస్ సొంతంగానే 80 వరకు శాసభసభ స్థానాలను గెలుచుకుంటామని చెప్తోన్న ఒకవేళ ఎక్కడైనా తేడా వస్తే అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతోంది. ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో నాలుగు వరకు స్థానాలు గెలుచుకుంటుందని విశ్వాసంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. జగన్ అంటరాని వాడుకాదని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించగా, సీపీఐ, ఎంఐఎం మద్దతుపైనా ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. పైకి తమకే అధికారం దక్కుతుందని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ గట్టిగా చెప్తోన్న పరిస్థితిలో ఏదైనా తేడా వస్తే ఎలా అని ఇప్పటి నుంచి అధికారం హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో నిక్షిప్తమైన ఓటరు నాడి మరో 24 గంటల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ అన్ని పార్టీల్లో నెలకొంది. అన్ని పార్టీలు ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.