కేబినెట్ కూర్పులో సంఘ్ ప్రమేయం ఉండదు: వెంకయ్య

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటు కానున్న కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) పాత్ర ఏమాత్రం ఉండదని బిజెపి సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చిన వెంకయ్య నాయుడు తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నేతలతో తమ భేటీలు తమ జీవితంలో భాగమని పేర్కొన్నారు.వెంకయ్య నాయుడుతోపాటు బిజెపి సీనియర్ నేతలు కల్ రాజ్ మిశ్రా, ధర్మేంద్ర ప్రదాన్, గోపీనాథ్ ముండే, హర్షవర్ధన్, రాజీవ్ ప్రతాప్ రూఢీ తదితర నేతలు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చి సంఘ్ నేతలతో చర్చించారు. ఈనెల 12వ తేదీన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి బిజెపి నేతల తాకిడి పెరిగింది.