పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు

హైదరాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని హత్య కుట్రను బెంగుళూరు పోలీసులు ఛేదించారు. హత్యకు సుపారీ తీసుకున్న ఐదుగురు ముఠా సభ్యులను కర్ణాటక నుండి రాష్ట్రంలోకి మారణాయుధాలతో ప్రవేశిస్తుండగా పోలీసులు హిందూపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని బెంగుళూరుకు తరలిస్తున్న సమయంలో దేవనహళ్లి వద్ద ముఠాలోని గోవింద్, గిరి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఘటనలో గోవింద్, గిరి ఇరువురు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురిని బెంగుళూరుకు తరలించారు.
వీరంతా అక్బరుద్దీన్‌ హత్యకు కుట్రపన్నినట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులపై కర్నాటకలో అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తుపాకులు, కత్తులతో స్థానికులను బెదిరిస్తూ ఈ ముఠా బీభత్సం సృష్టిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ముఠాకి గిరి నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓవైసీ హత్యకు అతనే సుపారీ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.