హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఉద్యోగులకు ‘స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్’ ఇస్తామని కాబోయే ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రభుత్వానికి ఉద్యోగులే కర్త, కర్మ, క్రియ అని ఆయన అన్నారు. చంద్రశేఖరరావు గురువారం హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి వద్ద ఆర్టీ కన్వెన్షన్ హాల్‌లో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉద్యోగులు స్నేహపూర్వకమైన ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని ధర్నాలు, సమ్మెలు, నోటీసులతో పనిలేదని కేసీఆర్ అన్నారు. యావత్ భారతదేశం చూసేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదామని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని, శాశ్వత ఉద్యోగులే ఉంటారని చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో శ్రమ దోపిడీకి తావు ఉండదని ఆయన అన్నారు.సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రతిపాదనను, రాష్ట్ర ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన స్కేల్ అమలు చేయాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ప్రైవేట్ సంస్థలకు అవకాశం ఇచ్చేది లేదని, ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే విద్యుత్ ఉత్పాదన జరుగుతుందని ఆయన ప్రకటించారు. తద్వారా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తామని టిఆర్ఎస్ అధినేత హామీ ఇచ్చారు. వేతన సవరణ కమిటీని(పిఆర్సీ) గడువు కన్నా ముందే నియమిస్తామని కాబోయే ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, వారికి ప్రసూతి సెలవులు పెంచుతామని, ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైన కనీస సదుపాయాలను కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. రాజకీయ నాయకులకైనా, ప్రభుత్వానికైనా, ఉద్యోగులకైనా ప్రజలే దేవుళ్ళని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పాటు పడదామని ఉద్యోగులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.