బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ డీజీపీ

హైదరాబాద్‌, జూన్‌ 2 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా అనురాగ్‌శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఇదే ¬దాలో ఆయన తొలి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పరేడ్‌ గ్రౌండ్‌లో కూడా డీజీపీ ¬దాలో కేసీఆర్‌ వెన్నంటి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ డీజీపీగా పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. తనవంతుగా తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకుంటానన్నారు. ఇంతకాలం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న ఐపీఎస్‌ అధికారి అనురాగ్‌శర్మ తెలంగాణ రాష్ట్ర తొలి పోలీసు బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ఇన్‌చార్జి డీజీపీగా ఆయన నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. అనురాగ్‌శర్మ సోమవారం ఉదయం 7.10 గంటలకు ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కొత్త రాష్ట్రం తొలి డీజీపీ నియమితులైన అనురాగ్‌ శర్మకు ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌తో అవినాభావ సంబంధం ఉంది. శర్మ తొలి ఉద్యోగ జీవితం నిర్మల్‌తోనే మొదలైంది. ఐపీఎస్‌కు ఎంపికై శిక్షణ పొందిన అనంతరం అసిస్టెంట్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా తొలిపోస్టింగ్‌ నిర్మల్‌ పోలీస్‌ సబ్‌ డివిజన్‌లోనే పొందారు. ఫిబ్రవరి 2,1985న నిర్మల్‌ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్‌ శర్మ మే 05,1986 దాక విధులు చేపట్టారు. అధికార బాధ్యతలను ఆయన సమర్ధంగా నిర్వహించారన్న పేరుంది. ఇప్పటికే ఆయనను డీజీపీగా నియమించాలంటూ యూపీఎస్సీకి ప్రతిపాదన వెళ్లింది. యూపీఎస్‌సీ నుంచి క్లియరెన్స్‌ రావడంతో ఆయన పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 1982వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అనురాగ్‌శర్మను మొదట్లోనే ఆంధప్రదేశ్‌ రాష్ట్ర కేడర్‌కు కేటాయించారు. తన సర్వీసులో భాగంగా ఆయన రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల సూపరిండింటెంట్‌గా పనిచేశారు. గ్రేహౌండ్స్‌లో గ్రూప్‌ కమాండర్‌ (ఆపరేషన్స్‌)గా, హైదరాబాద్‌ దక్షిణ మండలం డీసీపీగా, వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా, ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ ఐజీగా బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్‌ యూనివర్సిటీ నుంచి జీవశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన అనురాగ్‌శర్మ డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ ఫారెస్ట్‌ కాలేజీ నుంచి అటవీశాస్త్రంలో డిప్లొమా పట్టా పొందారు. ఆ తరువాత చెన్నైలోని లయోలా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి హ్యుమన్‌ రీసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లోమా చదివారు. 1995లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని బ్రంషీల్‌లో కమాండ్‌ కోర్స్‌ను పూర్తి చేసిన అనురాగ్‌శర్మ 2003లో ఇజ్రాయిల్‌లో ¬స్టేజ్‌ నెగోషియేషన్‌ అండ్‌ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ చదివారు. అదే సంవత్సరంలో అమెరికాలో ఎఫ్‌బీఐ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణా శిబిరానికి వెళ్లి క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును పూర్తిచేశారు.

ఐదేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో విధులు

తెలంగాణ ఇన్‌చార్జ్జి డీజీపీగా నియమితులైన అనురాగ్‌శర్మ కేంద్ర సర్వీసుల్లో ఐదేళ్లపాటు పనిచేశారు. ఈ క్రమంలో సెంట్రల్‌ ఇండస్టియ్రల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) సౌత్‌ సెక్టర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ)లో ఐజీ ట్రైనింగ్‌ సెక్టర్‌ అండ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. సీఐఎస్‌ఎఫ్‌లో అనురాగ్‌శర్మ ఉన్నపుడే అందులో ఆయన ట్రైనింగ్‌ను ప్రారంభించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరినందుకు 1998లో రాష్ట్రపతి పోలీసు పతకాన్ని సాధించారు. 2004లో ఆంత్రిక్‌ సురక్ష సేవా పతకం, 2007లో రెండోసారి రాష్ట్రపతి పోలీసు పతకం ఆయనను వరించాయి. కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కివచ్చిన తరువాత గ్రేహౌండ్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నారు. అనురాగ్‌శర్మ రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన మమతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 1982లో వీరిద్దరు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణకాలంలో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. 1985లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు. కుమార్తె అమెరికాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేయగా, కుమారుడు అమెరికాలోనే ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. శిక్షణ అనంతరం మమతారెడ్డిని పశ్చిమబెంగాల్‌ కేడర్‌కు కేటాయించగా, అనురాగ్‌శర్మ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు వచ్చారు. 2005లో మమతారెడ్డి ఐపీఎస్‌కు రాజీనామా చేశారు.