నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ : నిబందనలకు విరుద్ధంగా వాహనాల నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో డ్రైవ్ చేపడుతున్నట్టు ట్రాఫిక్ చీఫ్ జితేందర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో ఉగ్రవాదులు, మావోయిస్టులు కదలికలున్నాయని, వారు వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చి సంచరిస్తున్నారన్నారు. విచారణ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నెంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మోటారు వెహికల్ (ఎంవీ)చట్టంలో పేర్కొన్న విధంగా వాహనాల ముందు భాగంలో, వెనుక నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నెంబర్ ప్లేట్లపై అక్షరాలు, అంకెలు కూడా నిబంధనల్లో పేర్కొన్న కొలతల ప్రకారమే ఉండాలని వివరించారు.