బెంగాల్‌లో శాంతిభద్రతలు అధ్వానం

రాజ్‌నాథ్‌సింగ్‌కు భాజపా రిపోర్టు
న్యూఢిల్లీ, జూన్‌ 13 (జనంసాక్షి) :
పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బృందం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు శుక్రవారం నివేదిక ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ శ్రేణులపై వరుసగా దాడులు జరుగుతున్న నేప థ్యంలో భాజపా ఉపాధ్యక్షుడు ముక్తార్‌ అబ్బాస్‌ నేతృ త్వంలో ఐదుగురు ఎంపీలు ఎన్‌ఎస్‌ అహ్లూ వాలియా, మీనాక్షిలేఖీ, బాబుల్‌ సుప్రియో, సిద్ధార్థ్‌ నాథ్‌సింగ్‌లు సభ్యులుగా గల బృందం ఆ రాష్ట్రంలో మే 31న పర్యటించింది. అక్కడ జరుగుతున్న హింసాత్మక చర్యలన్నీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రోద్భలంతోనే జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్‌ చేసుకుంటూ నివేదిక రూపొందించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నది కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారేనని నివేదికలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం వీయడంతో తమ పట్టు ఎక్కడ కోల్పోతామోనని తృణమూల్‌ సహా చాలా పార్టీలకు వణుకు పుట్టిందని, ఆ నేపథ్యంలోనే దాడులు జరుగుతున్నాయని తెలిపింది. ఈ దాడులకు వెంటనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆ రాష్ట్ర గవర్నర్‌ నుంచి నివేదిక తెప్పించుకోవాలని తాము కోరినట్లు నఖ్వీ వివరించారు. రాజ్‌నాథ్‌తో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సమాచార శాఖ కమిషనర్‌గా ఆర్‌వీ చంద్రవదన్‌
హైదరాబాద్‌, జూన్‌13 (జనంసాక్షి) :
తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా ఆర్‌వీ చంద్రవదన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోనూ ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌గా పనిచేశారు. తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో ఆయన కమిషనర్‌గా, ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన గతంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో సేవలందించారు.
ఎన్నికల హామీలకు కట్టుబడ్డాం
సీమాంధ్ర మీడియా చిలువలు పలువలు చేస్తే చర్యలు తప్పవు
సోనియా వల్లే తెలంగాణ
వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తా
ధన్యవాద తీర్మానంపై సీఎం కేసీఆర్‌ సమాధానం
హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) :ఎన్నికల సమయం లో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించే క్రమంలో విపక్షాల సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడిం చారు. తెలంగాణలో కొత్త ఒరవడి సృష్టిస్తామని ఒంటెత్తు పోక డలకు పోకుండా అందరితో చర్చించే విధానపర నిర్ణయాలు జరుగుతాయన్నారు. పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఉద్ఘాటించారు. బంగారం కుదువు పట్టి పంట కోసం తెచ్చిన రుణాలు కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్య మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలన్నింటినీ తప్పకుండా వంద శాతం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటైందని.. ప్రతిపక్షాలు ఇచ్చే నిర్మాణాత్మక సల హాలను స్వీకరిస్తామని చెప్పారు. రాజ కీయ అవినీతి బంద్‌ అయితే మిగతా వ్యవస్థ దానంతట అదే సక్రమమ వుతుందని తెలిపారు. వందకు వంద శాతం రాజకీయ అవినీతి రహతి పాలన అందిస్తామని చెప్పారు. రాజకీ య అవినీతికి పాల్పడిన వారు తన కుటుంబ సభ్యులైనా వారిని జైలుకు పంపిస్తానన్నారు. తెలంగాణ ఇచ్చిన యూపీఏకు, సోనియాకు కృతజ్ఞతలు చెప్పలేదన్న కాంగ్రెస్‌ విమర్శలను కేసీఆర్‌ తన ప్రసంగంలో ప్రస్తావిం చారు. తెలంగాణ సంస్కారాన్ని ప్రతిబింబించేలా తాము వ్యవహ రిస్తామని ఎన్నికల ప్రచార సమయంలోనే సోనియాగాంధీ చొరవ వల్లే తెలంగాణ ఏర్పడిందని చాలా స్పష్టంగా చెప్పానని తెలిపారు. ఈ సందర్భంగా మరోమారు సోనియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా ప్రత్యేకంగా
చొరవ తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు. సీపీఐ, బీఎస్పీతో పాటు 33 పార్టీలు సహకరించాయన్న కేసీఆర్‌ ఆయా పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరలేదని విధానాల రూపకల్పనకు కొంత సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సహకారం అందించాలని కోరారు. ఒంటెత్తు పోకడతో పోమని, అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ఏ ఒక్కరితో ఏర్పడింది కాదన్నారు. అందరి పోరాటంతోనే రాష్టాన్న్రి సాధించుకున్నామన్నారు. ‘ఈ దఫా ఉద్యమానికి సృష్టికర్తను నేను ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో తెలంగాణ ప్రజలంతా పాల్గొన్నారని.. ఫలితంగానే తెలంగాణ కల సాకారమైంది. ఇందుకు కారణమైన ప్రజలు, ఉద్యోగులు, పార్టీలు, అక్కలు, చెల్లెళ్లకు, యావత్‌ తెలంగాణ ప్రజలందరికీ చేతులెత్తి, శిరస్సు వహించి ధన్యవాదాలు చెబుతున్నానని’ చెప్పారు. ప్రజల ఆశలు తప్పకుండా నెరవేరుస్తామని ప్రకటించారు. ‘ప్రజల ఆశలు వమ్ము కావు.. మనం కోరుకున్న బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతుందని’ ధీమా వ్యక్తం చేశారు.
రిజర్వేషన్లు అమలు చేస్తాం
రాష్ట్ర సాధనతో సాగునీటి పంపకాల్లో తెలంగాణ తన వాటా సాధించుకుంటుందని కేసీఆర్‌ తెలిపారు. సంక్షేమ పథకాల అమలుపై కాల పరిమితి ప్రకటిస్తామన్నారు. కొత్త రాష్ట్రం నేపథ్యంలో ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. రిజర్వేషన్లపై విపక్షాల సందేహాలు సహజమేనన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే రిజర్వేషన్లపై హామీ ఇచ్చామని చెప్పారు. తమిళనాడలో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని వివరించారు. కర్ణాటకలోనూ 50 శాతానికంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు. అక్కడ అమలు కాగా లేనిది తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. 85 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్న మన రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లకే పరిమితమవడం సరికాదని చెప్పారు. తమిళనాడులో అనుసరిస్తున్న తరహా రిజర్వేషన్లు మన రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తొమ్మిదో షెడ్యూల్‌లో మార్పులు చేయిస్తామని, తద్వారా తాము ఇచ్చిన హావిూ మేరకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. బీసీల రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించబోమన్నారు.
1969 అమరవీరులకూ లబ్ధి
అమర వీరులకు ఎంత ఇచ్చినా తక్కువేనని కేసీఆర్‌ అన్నారు. ఏం చేసినా అమరవీరులను తీసుకురాలేమని అయితే, వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. 1969 ఉద్యమకారులను కూడా గుర్తించి వారికి కూడా ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఈ దఫా ఉద్యమానికి మూలం 1969 ఉద్యమేనని ఈ నేపథ్యంలో నాటి ఉద్యమకారుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.
సంక్షేమానికే పెద్దపీట..
గవర్నర్‌ ప్రసంగం టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలా ఉందన్న విమర్శలను ఎత్తిచూపుతూ వాస్తవానికి గవర్నర్‌ ప్రసంగం అలాగే ఉండాలన్నారు. తాము మేనిఫెస్టోను చూసి, ప్రసంగాలు విని ప్రజలు ఓట్లేశారని ప్రజలు నమ్మిన వాటినే గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొనడం ప్రజాస్వామ్యమన్నారు. దళితులకు తప్పకుండా మూడేకరాల భూమి కేటాయిస్తామని స్పష్టం చేశారు. దీనిపై తాము ఇప్పటికే దృష్టి సారించామన్నారు. వికలాంగులకు రూ.1500, వితంతువులు, వృద్ధులకు రూ.వెయ్యి పెన్షన్‌ తప్పకుండా అమలు చేస్తామని ఉద్ఘాటించారు. బీడీ కార్మికులకు రూ.వెయ్యి భృతి ఇస్తామన్నారు. గతంలో 7 లక్షల బీడి కార్మికులు ఉండేవారని, ప్రస్తుత లెక్కలు ఇంకా అందలేదని చెప్పారు. వివరాలు రాగానే దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. పేదలకు రెండు పడక గదుల ఇంటిని తప్పకుండా నిర్మించి అందజేస్తామన్నారు.
బంగారు రుణాలపైనా మాఫీ..
రైతు రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్‌ తేల్చి చెప్పారు. పంట రుణాలపై వివరాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరామన్నారు. నాలుగైదు రోజుల్లో పూర్తి వివరాలు వస్తాయని ఆ తర్వాత విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. పంటల కోసం తీసుకున్నారు. గోల్డ్‌ లోన్స్‌ కూడా మాఫీ చేస్తామని ప్రకటించారు. దీని వల్ల ప్రభుత్వం రూ.19 వేల కోట్ల భారం పడుతుందని ఎంత భారం పడినా రైతు కోసం తాము భరిస్తామన్నారు. పంట రుణ మాఫీ వల్ల 26 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని తెలిపారు. రాబోయే కొద్దిరోజుల్లోనే దీన్ని అమలు చేస్తామని సభలో ప్రకటించారు. రాష్ట్రంలో విత్తనాలకు కొరత లేదని కేసీఆర్‌ చెప్పారు. సకాలంలో వర్షాలు రాలేదని విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం లేదన్నారు. అవసరమైన విత్తనాలు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచామని వివరించారు. సోయాబీన్‌ విత్తనాల విూద 33 శాతం అడ్వాన్స్‌గా చెల్లించాలని గత ప్రభుత్వం పెట్టిన నిబంధనను తాము తొలగించామని చెప్పారు. అలాగే, వరి విత్తనాలపై సబ్సిడీ కొనసాగిస్తామని చెప్పారు. నల్లగొండ, మెదక్‌ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తొలగించిందని, అయితే, ఆ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
సాగునీటికి ప్రాధాన్యం..
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని కేసీఆర్‌ అన్నారు. సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే.. ఇందుకోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పారు. వాస్తవానికి తెలంగాణకు గోదావరి నుంచి 900 టీఎంసీలు, కృష్ణ నుంచి 377 టీఎంసీలు కేటాయించారని.. కానీ కేటాయించిన విధంగా ఎన్నడూ నీటి వాటా దక్కలేదన్నారు. తెలంగాణకు 1277 టీఎంసీల నీరు కేటాయించి ఉంటే.. కోటి 30 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతుండేదన్నారు. తాము చెప్పినట్లు కచ్చితంగా నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీటిని అందజేస్తామని చెప్పారు. నీటిపారుదల నిపుణులతో చర్చించిన తర్వాతే నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎస్సారెస్పీ దిగువన ప్రాణహిత కలిసే చోట, కాళేశ్వరం పైనా ఉండే ప్రాంతంలో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆగమేఘాల విూద ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. జూరాల-పాకాల కాలువను కచ్చితంగా తవ్వితీరతామని తెలిపారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు ఇది వరప్రదాయినిగా మారుతుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కచ్చితంగా నెరవేరుస్తామని ప్రకటించారు. కృష్ణా జలాల విషయంలో మన న్యాయమైన వాటాను దక్కించుకుంటామని పేర్కొన్నారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు చిత్రవిచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై తాము గతంలోనే టీఆర్‌ఎస్‌ తరఫున సుప్రీంకోర్టులో కేసు వేశామన్న కేసీఆర్‌.. ఇప్పుడు ప్రభుత్వం తరఫున పోరాడతామని తెలిపారు. అవసరమైతే ట్రైబ్యునల్‌ ముందు ముఖ్యమంత్రిగా హాజరై వాదిస్తానని చెప్పారు. హైదరాబాద్‌కు 50-60 టీఎంసీలు కేటాయించాలని వాదిస్తానన్నారు.
మూడేళ్లలో మిగులు విద్యుత్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవలంబిచంఇన తప్పుడు విధానాల వల్ల తెలంగాణకు విద్యుత్‌ సమస్య ఏర్పడిందని విమర్శించారు. ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల అల్టా పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు దాన్ని వెంటనే అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరానని వెల్లడించారు. అలాగే, సీలేరు ప్రాజెక్టు లాక్కొవడం ఎంతవరకూ సమంజసమని మోడీని ప్రశ్నించానని చెప్పారు. ఆర్డినెన్స్‌ చట్టంగా మారే క్రమంలో ఆ అంశాన్ని పరిశీలిస్తామని మోడీ హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే అఖిలపక్షం ఢిల్లీ వెళ్లి ఒత్తిడి తెద్దామని ప్రధానిని కలిసి సీలేరు ప్రాజెక్టును దక్కించుకొనేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,700 మెగావాట్లు వినియోగం కాగా.. గత ఐదేళ్ల వినియోగం ఆధారంగా తెలంగాణకు 53.89 శాతం కేటాయించారని తద్వారా 8,990 మెగావాట్లు మనకు వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పీపీఏల కింద చేసుకున్న అగ్రిమెంట్లు అన్యాయంగా ఉన్నాయని విమర్శించారు. ఒప్పందం ప్రకారం 4 వేల మెగావాట్లు సప్లై చేయాల్సి ఉండగా 1600 మెగావాట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారని అయితే, రాని విద్యుత్‌కు కూడా మనం డబ్బు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఉన్న పరిశ్రమ పోవద్దన్నా.. కొత్త పరిశ్రమలు రావాలన్నా విద్యుచ్ఛక్తి చాలా ప్రధానమైందన్న కేసీఆర్‌ విద్యుత్‌ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నార్త్‌-సౌత్‌ గ్రిడ్‌ అనుసంధానం వల్ల 1500 మెగావాట్లు లభిస్తుందని, ఇందులో మనకు 300 మెగావాట్లు వచ్చే అవకాశముందన్నారు. రాబోయే రోజుల్లో మరో 2,500 గ్రిడ్‌ నుంచి వస్తుందని చెప్పారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తామని వివరించారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వమే విద్యుత్‌ కొనుగోలు చేస్తుందని, ఇందులో ప్రైవేట్‌ కంపెనీలకు అవకాశమివ్వబోమన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తామని తెలిపారు. అదనపు విద్యత్‌ రావాలంటే ఏడాది సమయం పట్టవచ్చని చెప్పారు. మూడేళ్లలో మిగులు విద్యుత్‌ సాధిస్తామని వివరించారు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతపై ముఖ్యమంత్రి స్పందించారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. తనపైనే 489 కేసులు ఉన్నాయని వివరించారు. తెలంగాణ విద్యార్తుల విూద, యువకుల విూద పెట్టిన కేసులను వంద శాతం ఎత్తివేస్తామని ఉద్ఘాటించారు. మన పరిధిలో ఉన్న కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. కేంద్రం, కోర్టుల పరిధిలో ఉన్న కేసులపైనా వారితో మాట్లాడతామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పునర్విభజన చట్టంలో భాగంగా పదేళ్ల పాటు విద్యారంగంలో యథావిధి పరిస్థితి ఉండాలని చెప్పారని గుర్తు చేసిన కేసీఆర్‌ హైదరాబాద్‌లో చదివే ఉమ్మడి ఆంధ్ర విద్యార్థులకు మనం స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. దీనిపై అఖిలపక్షంతో చర్చించి విధివిధానాలను రూపొందిస్తామన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో రాజీ లేదన్నారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాల సంఖ్య ఎక్కువగా పెరిగితే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎక్కువగా వస్తాయని చెప్పారు.
విశ్వనగరంగా హైదరాబాద్‌
హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. హైదరాబాద్‌ను తాము అభివృద్ది చేశామని కొంత మంది చెప్పుకుంటున్నారని విమర్శించారు. వారు అభివృద్ది చేస్తే.. నాలుగు చినుకులు పడగానే రోడ్లపైకి, బస్తీల్లోకి ఎందుకు నీరు చేరుతోందని ప్రశ్నించారు. నగరంలో డ్రైనేజీని ఆధునకికీకరిస్తామని వెల్లడించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డును త్వరలో పూర్తిచేస్తామని చెప్పారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. మెట్రో ప్రాజెక్ట్‌లో అశాస్త్రీయమైన విధానం ఉందని.. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మెట్రో ప్రాజెక్ట్‌ వల్ల చారిత్రక కట్టడాలకు భంగం కలగకుండా చూస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎదుట అండర్‌గ్రౌండ్‌లో మెట్రో నిర్మించాలని, అలాగే, సుల్తాన్‌బజార్‌ ధ్వంసం కాకుండా మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని ఎల్‌అండ్‌టీకి సూచించానన్నారు. పాతబస్తీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌ను గుడిసెలు లేని నగరంగా మారుస్తామని చెప్పారు. అవసరమైతే రూ.5-10 వేల కోట్ల రుణం తీసుకొని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వీకర్‌సెక్షన్‌ హౌసింగ్‌ ప్రోగ్రామ్‌ కింద బడుగులకు ఇళ్లు అందజేస్తామన్నారు.
అవినీతిని వెలికితీస్తాం
గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల అంతులేని అవినీతి జరిగిందని కేసీఆర్‌ వెల్లడించారు. ఇందుకు ఆయన పలు ఉదాహరణలు తెలిపారు. 1983 నుంచి ఇప్పటివరకు 42 లక్షల ఇళ్లు నిర్మించారని వివరించారు. మరో 5 లక్షల ఇళ్లు మంజూరై వివిధ స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. 8-10 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. అంటే మొత్తంగా 55 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని.. ఆ లెక్కన సగం కుటుంబాలకు సొంత ఇళ్లు ఉన్నట్లేనని తెలిపారు. 2011 జనాభా లెక్క ప్రకారం తెలంగాణలో కుటుంబాల సంఖ్య 84 లక్షలు కాగా 50 శాతానికి పైగా తెలంగాణ ప్రజలకు ఇళ్లు మంజూరయ్యాయని లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. ఇదివరకు ఇచ్చిన వాటికే మళ్లీ అనుమతులు ఇచ్చారన్నారు. అక్రమార్కులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అయినా, అధికారులైనా, పైరవీకారులైనా చర్యలు తప్పవన్నారు. తెలంగాణలో మొత్తం 84.20 లక్షల కుటుంబాలు ఉంటే తెల్లరేషన్‌ కార్డులు 91.94 లక్షలు జారీ చేశారని వెల్లడించారు. వాస్తవానికి కుటుంబాల సంఖ్య తక్కువగా ఉంటే కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. మరో తమాషా ఏమంటే గులాబీ రంగు కార్డులు మరో 15.07 లక్షలు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 1.07 లక్షల కార్డులు ఉన్నాయని ఇవి కాక, కొత్త కార్డుల కోసం ఇంకా పెండింగ్‌ అప్లికేషన్లు ఉన్నాయని తెలిపారు. ఇలా ప్రతీ జిల్లాలో కుటుంబాల సంఖ్య కంటే కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. దీనిపై అఖిలపక్షంలో చర్చించి ఏమేం చర్యలు తీసుకోవాలో నిర్ణయిద్దామని తెలిపారు.
మీడియాపై చర్యలు తప్పవు..
తెలంగాణ రాష్ట్రం అంటేనే ఈర్ష్య, అసూయ, ద్వేషం కలిగిన కొన్ని వార్తాచానెళ్లు, పేపర్లు ఇష్టానుసారం కథనాలు ప్రచురిస్తున్నాయని విమర్శించారు. కేబినెట్‌లో జరిగిన విషయాలను చెప్పకుంటే మొహం చాటేశారని పత్రికల్లో రాశారని ధ్వజమెత్తారు. వాహన నెంబర్ల విషయంలోనూ తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ఇలాగే వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో కేబుల్‌ టీవీ చట్టాలు తీసుకొస్తామని హెచ్చరించారు. చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నామని, పిట్ట కథలకు ఎవరూ భయపడబోరని తెలిపారు. శాసనసభ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న మీడియాపై కఠినంగా వ్యవహరించాలని, ప్రివిలైజ్‌ మోషన్‌ కింద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు.