పట్టభద్ర ఎన్నికల్లో జోరు పెంచిన పార్టీలు

 

ఉధృతంగా ప్రచారం చేస్తున్న నేతలు

వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌, బిజెపిలు జోరుపెంచాయి. తమ అభ్యర్థుల తరఫున నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా నేతలు బిజీగా ఉండడంతో ఆదివారం దీనికి కేటాయించి జిల్లాలో ప్రచారం ఉధృతం చేశారు. ఓ వైపు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మరోవైపు బిజెపి నేతలు జిల్లాలో ప్రచారంలో తలమునకలయ్యారు. బిజెపికి టిడిపి కూడా తోడు కావడంతో ఇరు శిబిరాల్లో ప్రచార వేడి అందుకుంది. బిజెపి అభ్యర్థి రామ్మోహన్‌రావును గెలిపించి ప్రజావ్యతిరే విధానాలకు పాల్పడుతున్న టిఆర్‌ఎస్‌కు  గుణపాఠం చెప్పాలని టిడిపి  పక్షనేతలు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోని ఓటర్లను చితన్యంచేసి తెరాస ఆట కట్టించాలని శ్రేణులకు ఎర్రబల్లి తదితరులు పిలుపునిచ్చారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే తెరాస ఆగడాలకు అంతులేకుండా పోతుందని, విద్యాలయాల పేరుతో ఆయన విద్యార్థులను మోసం చేశాడని పేర్కొన్నారు. జిల్లాలో టిడిపి సమన్వయ సమావేశంలో భాజపా శాసనసభ పక్షనేత డాక్టర్‌ కె.లక్ష్మణ్‌  కూడా పాల్గొన్నారు.  తెరాస రిమోట్‌ కంట్రోల్‌ ఎంఐఎం చేతిలో ఉందని  నిజాయితీపరుడైన రామ్మోహన్‌రావును గెలిపించి మోదీకి బహుమతిగా అందజేయలని టిడిపి  కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక టిఆర్‌ఎస్‌ తరఫున కడియం, హరీష్‌ రావులు జిల్లాలో ప్రచారం చేపట్టారు. తెరాస అభ్యర్థి పల్లాకు ఓట్లు వేసి  గెలిపించుకోవల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారసభ నిర్వహించి కార్యకర్తలకు సూచనలు చేశారు. తెలంగాణలోటిడిపిని ప్రజలు నమ్మరని తెలిసే భాజపా అభ్యర్థులకు మద్దుతిచ్చారని విమర్శించారు. భాజపా అభ్యర్థులకు ఓటువేస్తే చంద్రబాబుకు ఓటువేసినట్లేనన్నారు. ఎన్నికల్లో గెలిచే దమ్ముంటే హైదరాబాద్‌ స్థానాన్ని భాజపాకు ఇచ్చి, వరంగల్‌ స్థానాన్ని తెదేపా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మొదటి ప్రాధాన్య ఓటుతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా అందించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.  ఎన్నికలకు ముందు ఇచ్చిన హావిూలన్నింటిని తప్పకుండా అమలుచేస్తామని తెలిపారు. దానిలో భాగంగానే ఉద్యోగులకు వేతన సవరణ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తగిన ప్రణాళిక రూపొందించామన్నారు. చట్టసభలకు మేధావులను పంపిస్తే ఈ ప్రాంత ప్రజల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి అధిక నిధులను తీసుకరావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆంధ్ర పార్టీ ఏజెంట్లలా శాసనసభలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.