9నుంచి మహామస్తకాభిషేకం

తరలివస్తున్న జైన సాధువులు

బెంగళూరు,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ధర్మస్థల గిరిధామంపై విరాజిల్లుతోన్న జగద్గురువు బాహుబలి మహామస్తకాభిషేకాలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈనెల తొమ్మిది నుంచి 18 వరకు బాహుబలి మహామస్తకాభిషేకాల్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. గడువు సవిూపించడంతో భక్తుల రాక పెరిగింది. పడమటి కనుమల్లోని ఈ దివ్య ధామానికి ఇప్పటికే వందలాది జైనమునులు చేరుకోగా- ప్రముఖుల రాకపోకలూ మొదలయ్యాయి. ఉత్సవాలకు ఏర్పాట్లు మరింత వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాలినడకన ప్రముఖ జైనమునులు ధర్మస్థలను చేరుకున్నారు. వారికి వివిధ కుటీరాల్లో బస ఏర్పాటు చేశారు. జైనమునులకు ఆహారాన్ని సమకూర్చేందుకే ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. మహామస్తకాభి షేకాలకు విగ్రహం వెనుకవైపున సారవ నిర్మాణం పనులు పూర్తయినాయి. అభిషేకాల్ని వీక్షించేందుకు వీలుగా విగ్రహం ఎదురుగా నిర్మిస్తున్న సారవ పనులు కూడా పూర్తికావచ్చాయి. ఇక్కడ నాలుగు వేల మంది వరకు భక్తులు కూర్చుని వీక్షించవచ్చు. కొండను చేరుకునే మార్గానికి ఇరువైపులా స్వాగత తోరణాల్ని, పట్టణంలో ప్రధాన వీధుల్లో ద్వారాల్ని, వివిధ రకాల అలంకరణల్ని పూర్తిచేశారు.