2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు
సంక్షేమ పథకం ప్రతి అర్హుడికి చేరాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) :
20047 విజన్ తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తో కలిసి మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మొదటగా వివిధ శాఖల అధికారుల పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా వివరించారు.
రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వివరాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్ పుస్తకాలు సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పూర్తి వివరాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. అదే విధంగా నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం – ఇంటర్మీడియట్ కు విస్తరణ, విభిన్న ప్రతిభావంత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రీయ వ్యవసాయం పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ప్రజా ప్రభుత్వంలో నిరుపేద లైన తమకి వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను సిఎస్. కలెక్టర్ నేరుగా అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి సిఎస్ మాట్లాడుతూ 2047 విజన్ తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. మనమందరం ఈ ప్రగతి పాలనలో భాగస్వాములం కావాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలతో పాటు, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అన్ని హాస్టళ్లు, పాఠశాలలో డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మహిళా సాధికారత కొరకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫాం కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా, గృహ జ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడం, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు.
అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను లబ్ధిదారులకు సిఎస్ అందజేశారు. గ్రామసభ సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను సిఎస్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, జిల్లా అధికారులు శ్రీలత, సురేష్, వనజాత, శ్రీలక్ష్మి, లలితాదేవి, తాహసిల్దార్, ఎంపీడీవో, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు..


