‘జనంసాక్షి’ కథనం.. 64 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్

రాజోలి, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : రాజోలి మండల కేంద్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ‘మనల్ని ఎవ్వర్రా ఆపేది ’శీర్షికన ‘జనంసాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. రాజోలి గ్రామ సమీపంలో ఇసుకాసురులు ఏర్పాటు చేసిన భారీ ఇసుక డంపులను గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తహసీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ గోకారి, మైనింగ్ బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తుంగభద్ర నదిలో నుంచి అక్రమంగా ఇసుకను నిల్వ ఉంచిన 64 ట్రాక్టర్ల ఇసుకను వారు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మన ఇసుక వాహనం ద్వారా ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు తరలించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇసుక తవ్వకాలపై పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.