ఉప ఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయి: కేటీఆర్
హైదరాబాద్ (జనంసాక్షి): రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, బీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని, దీనిపై పార్టీ కౌన్సిలర్లకు విప్ను జారీ చేస్తామని, ఎవరైనా ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సరైన బలం లేదుకాబట్టే అభ్యర్థిని నిలబెట్టలేదని ఆయన చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో కేటీఆర్ మాట్లాడారు. “ఇప్పుడు కాదు.. మూడు నెలలో.. ఆరు నెలలో లేదంటే మరో ఏడాదికో ఎప్పుడు ఉప ఎన్నికలొచ్చినా తుఫాను వాతావరణంలో గులాబీ జెండా ఎగురుతుంది” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే బీఆర్ఎస్ ను గెలిపించుకుంటారు. చేసిన పనులు చెప్పుకోలేకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయాం. డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు పెరుగుతాయి.. హైదరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా బీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.