ఎర్త్ డే – స్టూడెంట్, యూత్ ఇన్ యాక్షన్ పోస్టర్ విడుదల
హైదరాబాద్ (జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. మంగళవారం ప్రపంచ ధరత్రీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఎర్త్ డే – స్టూడెంట్, యూత్ ఇన్ యాక్షన్ పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి సమస్త జీవరాశులకూ ఆధారమని పేర్కొన్నారు. పుడమి తల్లి మానవాళి జీవనానికి అవసరమై గాలి, నీరు, ఆహారం, ఉపాధి కల్పిస్తోందన్నారు. వాతావరణ మార్పులు వంటి ఇతరత్రా చర్యలతో ప్రకృతి వనరులు విధ్వంసానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధనాలు, గ్రీన్‌హౌస్ వాయువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని సూచించారు. అలాగే, సౌర-పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధనాలను పెంచుకోవాలన్నారు. రానున్న రోజుల్లో భూమిని కాపాడుకునేందుకు సోలార్ ఎనర్జీ చాలా అవసరమని, సోలార్ ఎనర్జీని ప్రోత్సాహించేందుకు దేవాదాయ శాఖకు చెందిన భూముల వినియోగంపై చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి సురేఖ తెలిపారు. ప్రతి ఒక్కరూ సోలార్ ఎనర్జీని వినియోగించుకునే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాని ఆమె పిలుపునిచ్చారు.