మేడ్చల్ మునిపాలిటీలో ప్రభుత్వ స్థలం కబ్జా!
మేడ్చల్ (జనంసాక్షి) : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్ ఫేస్ టూలోని పార్కు స్థలం కబ్జా అవుతుంది. గత కొంతకాలంగా ఆక్రమణ పర్వం సాగుతున్నా మేడ్చల్ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రభుత్వ అధికారుల బాధ్యత అని ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ.. పర్యవేక్షించాల్సిన అధికారులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా జరగడం వల్ల భవిష్యత్తులో ప్రజలకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండవని, కావున అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడడంతోపాటు కబ్జాకు యత్నించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ లోపం వల్ల కబ్జాల పర్వం మరింత జోరుగా సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు. హైడ్రా వంటి వ్యవస్థలను రంగంలోకి దించి ఒకపక్క ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ధ్యేయంగా సర్కారు పనిచేస్తున్నప్పటికీ.. మేడ్చల్ లో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికైనా స్పందించి వెంటనే ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.