విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం కల్పించాలిబత్తుల నర్సింహులు ముదిరాజ్

జడ్చర్ల, ఏప్రిల్ 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణులై, తక్కువ మార్కులు పొందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల నర్సింహులు ముదిరాజ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు అవకాశం కల్పించిందని గుర్తుచేశారు. అదేవిధంగా తెలంగాణలోనూ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంటర్మీడియట్ మార్కులు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని, బీటెక్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువుల్లో సీట్లు పొందడానికి ఇంటర్ మార్కులే ప్రామాణికంగా ఉంటాయని పేర్కొన్నారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు పైచదువులకు వెళ్లలేక నిరాశ చెందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా మార్కులు పెంచుకునేలా వెంటనే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షునిగా తాను విద్యార్థుల పక్షాన ఈ విన్నపాన్ని చేస్తున్నానని, ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని బత్తుల నర్సింహులు ముదిరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.



