బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి

బోధన్, (జనంసాక్షి) : అందం కోసం, అపోహలతో తల్లులు తమ బిడ్డలకు తల్లిపాలను దూరం చేస్తున్నారని అయితే బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లి పాలనే అందించాలని ఐసిడిఎస్ బోధన్ సిడిపిఓ దారోజు పద్మ స్పష్టం చేశారు. శనివారం ఐసిడిఎస్ కార్యాలయంలో రాకాసిపేట్ సెక్టర్ పరిధిలోని సూపర్వైజర్ రాధిక ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని సిడిపిఓ దారోజు పద్మ, రాకాసిపేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ విఠల్ రాజుల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ దారోజు పద్మ మాట్లాడుతూ, తల్లి గర్భం దాల్చినప్పటినుడి రెండు సంవత్సరాల వరకు 1000 రోజుల దినాన్ని బంగారు రోజులుగా పరిగణించాలని తద్వారా బిడ్డ ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పేద కుటుంబాలలో మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో భాగంగా గర్భిణీ మహిళలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ఎంతో పోషక విలువలు ఉండే ఆహారాన్ని అందిస్తున్నారని ఆమె అన్నారు. చిన్నారుల ఎదుగుదల, గర్భిణీ మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి పౌష్టిక ఆహారాన్ని అందించడంతోపాటు వైద్య సేవలు సైతం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. కిశోర బాలికల ఆరోగ్యాన్ని సైతం ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వారి ఎదుగుదల అంశాలతో పాటు వారి ఉచితంగా వైద్య సౌకర్యాన్ని సైతం కల్పించడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో పాలు, గుడ్లు, ఆకుకూరలతో కూడిన ఆహారాలతో పాటు పోషక విలువలు ఉండే బాలమృతం, బాలామృతం ప్లస్ లను అందించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకారం అందించాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకొని తల్లి, బిడ్డల ఆరోగ్యంను కాపాడుకోవాలని సిడిపిఓ దారోజు పద్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాకాసిపేట్ సూపర్వైజర్ రాధిక, వైద్యులు విఠల్ రాజు, అంగన్వాడి టీచర్లు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. చిన్నారులు చేసిన డాన్స్ ప్రోగ్రాం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది.

తాజావార్తలు