ఆ బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి
హైదరబాద్ (జనంసాక్షి) : రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. ఇదిలావుంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు చెప్పింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇదే ప్రథమం. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే మూడు నెలల్లోగా ఆ బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది.