శాలువాలు అమ్మేవాళ్లు మమ్మల్ని తప్పుదారి పట్టించారు… ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ భార్య
హైదరాబాద్ (జనంసాక్షి) : మధుసూదన్, ఆయన భార్య ఇద్దరూ భోజనం ముగించుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే కాల్పుల శబ్దాలు వినిపించాయి.”మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్‌గైడ్ చేస్తూ.. అది కేవలం వేడుకలని, ఇక్కడే ఉండండి అన్నారు” అని ఆమె పేర్కొన్నారు. అయితే, అక్కడే ఉన్న ఒక హోటల్ యజమాని మాత్రం ప్రమాదాన్ని పసిగట్టి, తమ పిల్లలను, ఇతరులను వెంటనే పారిపోవాలని హెచ్చరించినట్లు చెప్పారు. ఆ సమయంలో తన భర్త, “మనమిద్దరం ఇక్కడే పడుకుందాం, నువ్వు తల ఎత్తవద్దు” అని చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. “ఆ షాట్‌కు ముందు ‘హిందూయే? ముస్లిమే?’ అని రెండు సార్లు అడిగారు. మేము ఏమీ స్పందించలేదు. వెంటనే షాట్ సౌండ్ వినిపించింది. నేను లేచి చూసేసరికి ఆయన ముఖం మొత్తం రక్తంతో నిండిపోయింది” అని చెబుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తన దుస్తులు కూడా రక్తంతో తడిసిపోయాయని, ఆ షాట్ తమవైపే జరిగిందని అప్పుడు అర్థమైందని ఆమె వాపోయారు. తన భర్తను కాల్చిన తర్వాత, తాను కూడా బయటకు పరిగెత్తానని, ఎవరైనా రక్షించేవారు కనిపిస్తారేమోనని చూశానని, కానీ ఎవరూ కనిపించలేదని ఆమె తెలిపారు. అక్కడున్న కొందరు తనను ఆర్మీ క్యాంప్ వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. “నన్ను కూడా కాల్చేయమని అడిగితే, ‘మోదీకి చెప్పుకోండి’ (మోదీ కో బోలో) అని అంటున్నారని” ఆమె ఆవేదనతో తెలిపారు. తన భర్తకు ఒకే ఒక్క బుల్లెట్ తగిలిందని, 46 బుల్లెట్లు తగిలాయనే వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు.