జర్నలిస్టులకు ఇన్ని సంఘాలు ఎందుకు?: జస్టిస్ ఎన్వీ రమణ
హైదరాబాద్ (జనంసాక్షి): జర్నలిస్టుల గురించి.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టుల గురించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టు అంటే సమాజాన్ని మేల్కొలిపే వ్యక్తి. మంచి నాలెడ్జ్, మంచి అవగాహనతో ఉండాలి. కానీ, నేడు చాలా తక్కువ మంది మాత్రమే అలా ఉంటున్నారు. ఇది సమాజానికి వ్యక్తిగతంగా జర్నలిస్టులకు కూడా మంచిది కాదు అని వ్యాఖ్యానించారు. విజయవాడలో శనివారం జరిగిన ఉగాది ఉత్తమ జర్నలిస్టు అవార్డు ఫంక్షన్‌లో ఆయన పాల్గొన్నారు. దీనిని ఓ సంస్థ నిర్వహించింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తమ జర్నలిస్టులకు జస్టిస్ రమణ అవార్డులు అందించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. జర్నలిజం అనేది వృత్తి అని ఉద్యోగం కాదని చెప్పారు. ఏదో టైం పాస్ కోసం చాలా మంది దీనిలోకి ప్రవేశిస్తున్నారని చెప్పారు. తద్వారా.. సరైన వార్తలు ప్రజలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యం గా విషయ పరిజ్ఞానం ఉన్న జర్నలిస్టుల కొరత ఎక్కువగా ఉందన్నారు. `ఏం జరిగినా దానిని వివిధ కోణాల్లో ప్రజల్లో ఏదో జరిగిపోయిందన్న కోణంలో ప్రచారం చేస్తున్నారు. ఇది జర్నలిస్టుల లక్షణంగా మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా అల్లర్లు జరిగే అంశాలు.. మతపరమైన సున్నిత అంశాలను సాధ్యమైనంత తక్కువగా ప్రజల మధ్య వివాదాలు రగలకుండా ప్రజెంట్ చేసేవారు. కానీ, ఇప్పుడు సంచలనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు` అని జస్టిస్ రమణ అన్నారు. విజయవాడలో చదువు పూర్తయిన తర్వాత. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఓ పత్రిక తనకు జర్నలిస్టుగా ఉద్యోగం ఇచ్చిందని దాంతో తాను విజయవాడలోని అనేక సమస్యలను పత్రికా ముఖంగా వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కరించేందుకు ప్రాధా న్యం ఇచ్చినట్టు తెలిపారు. అప్పటికి ఇప్పటికి జర్నలిజంలో మార్పు వచ్చినా జర్నలిస్టులు సమాజాన్ని చూసే కోణంలో ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది తన అభిప్రాయంగా చెప్పారు. ప్రజా దృక్ఫథాన్ని అర్థం చేసుకుని ముందుకుసాగితే. జర్నలిస్టులకు జీవితం వృత్తి చాలా విశాలంగా ఉంటాయన్నారు. అలా కాకుండా ఉంటే ఇది కేవలం ఉద్యోగంగా మాత్రమే మారుతుందన్నారు. పాత్రికేయ విలువలు ఇప్పుడు రాను రాను కుంచించుకు పోతున్నాయని చెప్పారు. జర్నలిస్టుల సంఘాలు పెరిగిపోయి విలువలు కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇన్ని సంఘాలు ఎందుకు? ఒక్కటి చాలని వ్యాఖ్యానించారు. మీలో మీకే ఎక్కువగా విభేదాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఒక జర్నలిస్టుపై మరొకరు ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 92 శాతం మంది జర్నలిస్టులు పేదలుగానే ఉన్నారు. కేవలం 6-7 శాతం మంది జర్నలిస్టులు మాత్రమే విలాస వంతమైన జీవితాలు గడుపుతున్నారు. అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.