అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవం

హైదరాబాద్ : తెలంగాణ భాషా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని టీఎస్‌ సర్కార్‌ నిర్ణయించింది. ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతినే తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ వేడుకల్లో సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కాళోజి పురస్కారం అందించేందుకు టీఎస్‌ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.తెలంగాణ భాషా దినోత్సవాన్ని రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా వేడుకలకు అధికార భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి అయిన సెప్టెంబర్‌ 9న తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లో ఘనంగా భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించటంతో పాటు అన్ని జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.కాళోజీ జయంతి నాడు నిర్వహించబోయే భాషా దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వేడుకలు చేయాలని కేసీఆర్‌ సూచించారు. ఆరోజు పాఠశాలల్లో తెలంగాణ భాష,మాండలికాలపై చర్చా గోష్టి, వ్యాస రచన, ఉపన్యాస, కవితా పోటీలు నిర్వహించాలని డిఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఆరోజు భాషా, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి కాళోజీ స్మారక పురస్కారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు . ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణకు నోచుకోని, అవహేళనకు గురయిన తెలంగాణ భాష,యాస నేడు అధికారిక ఉత్సవాల్లో ప్రధాన వస్తువుగా ఉండటం పై పలువురు తెలంగాణవాదులు, కవులు, కళాకారులు,భాషా ప్రేమికులు అంబరాన్నంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.