ఆడబిడ్డల ఆరోగ్యరక్షణకే “ఆరోగ్య మహిళ “

 

 

 

 

 

– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్ జనంసాక్షి, మంథని : ఆడబిడ్డల ఆరోగ్య రక్షణకే ప్రభుత్వం ఆరోగ్య మహిళను ప్రవేశపెట్టిందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. ఈనాడు వాతావరణంలో వస్తున్నఅనేక మార్పులతో కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయని అన్నారు. అయితే పేద కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ఇందులో బాగంగానే అత్యధికంగా క్యాన్సర్‌ బారిన పడుతున్న మహిళలకు మంచి వైద్యం అందించాలని సీఎం కేసీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావులు గొప్పగా ఆలోచన చేసి ఆరోగ్య మహిళకు రూపకల్పన చేశారని అన్నారు. ఈనాడు ఎంతో మంది మహిళలు క్యాన్సర్‌ బారినపడి నాలుగో స్టేజీలో గుర్తించి ఆస్పత్రి పాలవుతున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైతే ఆ వ్యక్తిని కాపాడుకునేందుకు కుటుంబమంతా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, రోగాలు కుటుంబానికి శాపం కావద్దని, అలాంటి పరిస్థితులు రావద్దన్నదే సర్కార్‌ ఆలోచన అన్నారు. ప్రతిమహిళ తమ ఆరోగ్యాన్నికాపాడుకుంటూ క్యాన్సర్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిత్యం గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్‌లు అందుబాటులో ఉంటారని, వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ఇక్కడ సాధ్యం కాని వైద్యానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. నెల రోజుల వ్యవధిలో ఎంతో మంది వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారని, ఇందుకు కారణాలను వైద్యులు సైతం గుర్తించలేకపోతున్నారని ఆయన వాపోయారు. అయితే ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని, ముందు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వైద్యసేవలు అందించడం ఆదృష్టంగా బావించాలని, మన తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే పేద వర్గాలకు ఉద్యోగ రిత్యా సేవలు అందిస్తున్నామని ప్రతి ఒక్కరు బావించాలని ఆయన సూచించారు. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళల ఆరోగ్య రక్షణకు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.