ఇంతకీ..పింకీ.. అతడా.. ఆమె!?

పింకీకి బెయిల్‌ మంజూరు
కోల్‌కతా, జూలై 10 : అథ్లెట్‌ పింకి ప్రమాణిక్‌కు మంగళవారంనాడు కోర్టులో ఊరట లభించింది. రేప్‌ కేసులో అరెస్టయిన పింకీకి నేడు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తన సహచరిపై అత్యాచారం చేసిందన్న ఆరోపణలపై గత నెల 14వ తేదీన ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. పింకీ మహిళ కాదని.. పురుషుడు అని, తనపై అత్యాచారం చేశాడంటూ పింకీ సహచరి ఫిర్యాదు చేసింది. అరెస్టు చేసిన వెంటనే ఆమెను ఆసుపత్రికి లింగ నిర్ధారణ పరీక్షల కోసం పంపారు. ఈ పరీక్షపై నివేదిక రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పింకీ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా మంగళవారంనాడు 24 ఉత్తర పరగణాల జిల్లా కోర్టు పింకీకి బెయిల్‌ మంజూరు చేసింది. కాగా లింగ నిర్దారణ పరీక్షల సమయంలో పింకీ నగ్న దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ వెబ్‌సైట్లలో హల్‌చల్‌ చేయడం సంచలనమైంది. దీనిపై పశ్చిమబెంగాల్‌ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పింకీని పోలీసులు కస్టడీలోను, జైలు లోను అమానవీయంగా చిత్రవధ చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలపై దర్యాప్తు జరపాలని హోంశాఖ, వైద్య, పోలీసుశాఖలను ఆదేశించింది. ఈ నెల 6వ తేదీన ఈ విషయమై కోల్‌కతా హైకోర్టులో ఒక అప్పీల్‌ దాఖలైంది. దీనిపై కోర్టు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లోగా కోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించింది. 2006లో దోహాలో జరిగిన ఎసియన్‌ గేమ్స్‌లో పింకీ స్వర్ణ పతకాన్ని సాధించింది.